సాధారణంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉండే సరిహద్దు నిరంతరం ఉద్రిక్తతలతో ఇరు దేశాల సైనికుల భారీ పహారాతో కనిపిస్తుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఇరు దేశాల సరిహద్దుల్లో కొంతమార్చు వచ్చిందని చెప్పొచ్చు. అదేసమంలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులు మాత్రం ఇపుడు అలాంటి వాతావరణాన్నే తలపిస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
అయితే, చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఘోషిస్తున్నారు. అనేక జాతీయ పార్టీల నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ, ఆయన అరెస్టును నిరసన తెలుపుతూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు భారీ కార్ల ర్యాలీని ఆదివారం చేపట్టారు.
మరోవైపు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ రాకుండా ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు. గరికపాడు వద్ద భారీగా మొహరించిన పోలీసుల వీడియోను టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.