తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న ప్రధాని - 11న ఏపీలో - 12న తెలంగాణాలో

బుధవారం, 9 నవంబరు 2022 (08:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 12వ తేదీన తెలంగాణాలో పర్యటించనున్నారు. ఏపీలో వైజాగ్, తెలంగాణాలో రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 
 
అయితే, ప్రధాని తెలంగాణ రాష్ట్ర పర్యటనపై తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మోడీ రామగుండం వస్తే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించింది. 
 
యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంశంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై సమాధానం చెప్పాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో విద్యార్థుల జేఏసీ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్రమే ఉద్దేశ్యపూర్వకంగా మోకాలొడ్డుతుందని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పైగా, ఇప్పటికే ప్రారంభించిన పరిశ్రమను కొత్తగా ప్రారంభించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు