2022 నాటికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధమే లక్ష్యం: ప్రధాని
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:09 IST)
వచ్చే 2022 నాటికి దేశవ్యాప్తంగా ఒకసారి వాడి వదిలేసే రీసైక్లింగ్ కాని ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆదిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి సూచించారు.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన,భారత్ మాల,వివిధ రైల్వే,రోడ్డు ప్రాజెక్టులు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం తదితర కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రగతి అంశాలపై ఆయన బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడి మాట్లాడుతూ జాతి పిత మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు.వాటిలో ముఖ్యంగా నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులు,కప్పులు,ప్లేట్లు,చిన్నబాటిళ్లు, స్ట్రా,సాచెట్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈనిషేధ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.ప్లాస్టిక్ భూతం పర్యావరణంపై పెను ప్రభావం చూపిస్తోందని చెప్పారు.
ఈ నేపధ్యంలో ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం సమరశంఖం పూరించిందని గ్రామాల నుంచి పట్టణాలు,నగరాల వరకు అన్నీ చోట్ల దశలవారీగా ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోది పేర్కొన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు రెడ్యూస్,రీసైకిల్ అండ్ రీయూజ్,రికవర్, రీడిజైన్, రీమాన్యు ఫ్యాక్చరింగ్ అనే 6ఆర్ విధానాన్ని అనుసరించాలని చెప్పారు.
2022 నాటికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహిత దేశం ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని మోది పునరుద్ఘాటించారు.
వివిధ రాష్ట్రాలు సింగిల్ యూజ్డ్ ప్రాస్టిక్ నిషేధంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యంగా విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు వంటివి నిర్వహించుడ ద్వారా దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రధాని మోది సిఎస్ లను ఆదేశించారు.అదే విధంగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస,నెహ్రూ యువకేంద్రాలు ద్వారా యువతలో పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని స్పష్టం చేశారు.
అంతేగాక రాష్ట్ర,జిల్లా స్థాయి మానిటరింగ్ మానిటరింగ్ కమిటీలు ద్వారా ఎప్పటి కప్పుడు సమీక్షించి ప్లాస్టిక్ నిషేధానికి చర్యల తీసుకోవాలని చెప్పారు.అలాగే వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకతపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులతో పర్యావరణం కలుషితం అవుతోందని ముఖ్యంగా మహాసముద్రాల్లో ప్లాస్టిక్ చేరి సముద్ర జీవజాలం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు.అలాగే మానవ ఆహార ఉత్పత్తులపై కూడా ప్రాస్టిక్ పెద్దఎత్తున ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు.ప్లాస్టిక్ వినియోగమేకాగు ఉత్పత్తిని కూడా నిలిపివేసే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ కవర్లు,బ్యాగులపై నిషేధం విధించాయని అదే దిశగా మిగతా రాష్ట్రాలు కూడా తగిన చర్యలు చేపట్టాలనని స్పష్టం చేశారు. ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది,యం.టి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.