దేశం శరవేగంగా మారిపోతోందని, కానీ, మావోయిస్టులు మారడం లేదని పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత జంపన్న వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పని చేయడంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం పార్టీ విధివిధానాలు సరిగా లేవని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారడంలేదన్నారు. తాను, తన భార్య సుదీర్ఘ జీవితాన్ని మావోయిస్టు పార్టీలోనే గడిపామని, దాన్ని వదలుకుని సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయామని తెలిపారు.
మావో పార్టీ నుంచి బయటకు రావడానికి ముఖ్య కారణం సైద్దాంతిక విబేధాలే అన్నారు. పీపుల్స్‌వార్ మొదలు మావోయిస్టు పార్టీ వరకు సుదీర్ఘకాలం కొనసాగిన విప్లవ జీవితమంతా ప్రజల కోసం నిజాయితీగా, నిబద్దతతో పనిచేశామన్నారు. గత 15 ఏళ్లలో అనేకమైన సామాజిక మార్పులు జరిగాయాన్నారు. ముఖ్యంగా భారత మావోయిస్టు పార్టీలో మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్దాంతాలు లేవన్నారు. పార్టీ విధానాల సమీక్షలో విఫలమైందన్నారు.
పార్టీలో స్వేచ్ఛ పుష్కలంగా ఉందని, నాయకత్వం కూడా తనను పార్టీలోనే కొనసాగాలని కోరిందని, సైద్ధాంతిక విభేదాలను చర్చించుకుందామని ప్రతిపాదించిందని కానీ, పార్టీలో కొనసాగడం మానసికంగా సాధ్యంకాదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వానికి లొంగిపోవాలన్న నిర్ణయం తీసుకుని పార్టీకి తమ ప్రతిపాదన ముందు ఉంచినట్టు తెలిపారు.