తన భర్త, వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయనను ప్రస్తుతం పనిష్మెంట్ సెల్‌లో ఒంటరిగా ఉంచారని ఆయన సతీమణి వల్లభనేని పంకజశ్రీ ఆరోపించారు. గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో ఉంటున్న తన భర్త వంశీతో పంకజశ్రీ శుక్రవారం ములాఖత్ నిర్వహించారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్తను ఒంటరిగా ఒక గదిలో ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేశారన్నారు. ఆయనకు ఫిట్స్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. తన భర్త 6/4 బ్యారెక్‌లో ఉంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వంశీని పనిష్మెంట్ సెల్‌లో ఉంచారని, 22 గంటల పాటు ఒంటరిగా ఉంచుతున్నారని చెప్పారు. ఒంటరిగా ఉంచుతూ ఆయన డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారని తెలిపారు. అందరు ఖైదీలతో కలిసి ఉంచాలని కోరారు. ముఖ్యంగా సంబంధం లేని కేసుల్లో ఇరికించారని, కనీసం చైర్ కూడా ఇవ్వలేదని ఆమె చెప్పారు.