హీరో రామ్‌కు వార్నింగ్ ఇచ్చిన విజయవాడ పోలీసులు.. ఎందుకు?

ఆదివారం, 16 ఆగస్టు 2020 (17:05 IST)
టాలీవుడ్ హీరో రామ్‌కు విజయవాడ పోలీసులు గట్టివార్నింగ్ ఇచ్చారు. విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ అగ్నిప్రమాదం కేసు దర్యాప్తునకు హీరో రామ్ అవాంతరాలు కలిగిస్తే ఆయనకు కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. దీంతో హీరో రామ్.. ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. 
 
విజయవాడలోని రమేష్ ఆస్పత్రి స్థానిక స్వర్ణ ప్యాలెస్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ ఆస్పత్రి ఏర్పాటు చేసింది. ఇది ఏపీ సర్కారు అనుమతితోనే ఏర్పాటు చేసింది. అయితే, ఇక్కడ అగ్నిప్రమాదం సంభవించి 10 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ వ్యవహారంపై ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో ఇప్పటివరకు డాక్టర్ మమత, సౌజన్యలను విచారించామని చెప్పారు. రమేశ్ చౌదరి అల్లుడు కల్యాణ్ చక్రవర్తి ఆదివారం విచారణకు రావాల్సి ఉందని, కానీ ఆరోగ్య సమస్యలతో రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉందని ఆయన సమాచారం అందించారని వెల్లడించారు. ఆయన అనారోగ్యం నిజమేనా, కాదా అనేది కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
 
వయోవృద్ధులకు తప్ప మరెవ్వరికీ విచారణ నుంచి మినహాయింపు లేదని, ప్రతి ఒక్కరూ విచారణకు రావాల్సిందేనని, వృద్ధులైతే తామే వారి వద్దకు వెళ్లి విచారిస్తామని ఏసీపీ వివరించారు. రమేశ్ ఆసుపత్రి వ్యవహారాన్ని తాము ఎంతో తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు జరుపుతున్నామని, ఆటంకం కలిగించాలని చూస్తే హీరో రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. విచారణలో అంతరాయాలు సృష్టించాలనుకునే ఎవరికైనా నోటీసులు పంపుతామని అన్నారు. 
 
కాగా, విజయవాడ రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో శనివారం హీరో రామ్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ విస్మయాన్ని కలిగించాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే రామ్ ఒక్కసారిగా ఏపీ వ్యవహారాల్లో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో తమకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కు కూడా నోటీసులు పంపుతామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హీరో రామ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
 
ఈ వ్యవహారంలో ఇకపై తాను ఎలాంటి ట్వీట్లు చేయబోనని తెలిపారు. "నాకు న్యాయంపై నమ్మకం ఉంది. నిజమైన దోషులు ఎవరైనా, ఎవరికి చెందినవారైనా తప్పకుండా శిక్షించబడతారని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే, ఈ వ్యవహారంలో చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశాను' అంటూ స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు