డిపాజిట్ కోల్పోయిన దేవినేని అవినాష్... మీకు సీటెందుకు ఇవ్వాలి?

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:56 IST)
విజ‌య‌వాడ రాజ‌కీయం మ‌ళ్లీ గ‌రంగ‌రంగా మారుతోంది. దేవినేని నెహ్రూ త‌న‌యుడు దేవినేని అవినాష్ పై  టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాం మోహన్ రావు సూటిగా కామెంట్స్ చేశారు. 
 
రాష్ట్రంలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒకప్రతిష్ట ఉంది.. ఇటువంటి జిల్లాలో కొందరు నాయకులు మాట్లాడే మాటలు, చేసే విమర్శలు సంస్కార హీనంగా ఉంటున్నాయి. ఈ నాయకులు మాట్లాడే మాటలు జిల్లా వాసులకు బాధ కలిగించేవిగా ఉన్నాయ‌ని గ‌ద్దె విమ‌ర్శించారు. 
 
ఈ ప్రభుత్వం రోడ్లు పై దృష్టి పెట్టేలా టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టింది, దీనిపై దేవినేని అవినాష్  అవగాహనరాహిత్యంగా  మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు. లోకేష్ లపై ఆయన స్ధాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటమిలు సహజం. మంగళగిరిలో లోకేష్ ఓటమి చెందార‌ని, ఆయ‌న‌ రాజకీయాలు నుండి తప్పుకోవాలని విమరిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంతో సహా విజయవాడ పార్లమెంట్లో మీరు డిపాజిట్ కోల్పోయారు. మీకు డిపాజిట్ లు తెచ్చేకునే శక్తే లేనప్పుడు, పార్టీలు సీటు ఎందుకు ఇవ్వాల‌ని అవినాష్ ను సూటిగా ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మెహ‌న్. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా ఓటమి చెందారు అనే విషయం గమనించాలని గ‌ద్దె చెప్పారు. 
 
చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం చేశారు. ఆయన రికార్డ్ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచారు.  ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఇటువంటి వ్యక్తుల‌ గురించి మాట్లాడేటప్పుడు మన స్ధాయి తెలుసుకొని మాట్లాడాలని అవినాష్ కు హిత‌వు చెప్పారు. 
 
వైసీపీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల్లో మీ పాత్ర ఎంత వరకు ఉంది? కేవలం రెండు సంవ‌త్స‌రాలలో 5 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో ప్రజలపై భారం వేస్తున్నారు. మీ నాయకుడు తీసుకునే నిర్ణయం సరైందే అని ప్రజలకు చెప్పే దైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం, నిత్యావసర ధరలు పెంపుపై ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలలో గెలుపు ఓటమిలు శాశ్వతం కాదు. మనం మాట్లాడే మాటలు శాశ్వతం అనే విషయాన్ని గమనించాలని దేవినేని అవినాష్ కు గ‌ద్దె హిత‌వు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు