గొడవపడి తిట్టుకున్న ప్రేమికులు... బలవన్మరణానికి పాల్పడిన ప్రియుడు!!

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:11 IST)
ఒకరినొకరు ఇష్టపడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు చివరకు ప్రాణాలు హరించేంతవరకు పోతున్నాయి. తాజాగా చిన్నపాటి విషయానికే ఓ ప్రేమజంట గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు కూడా మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లా మధురవాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని వైఎస్సార్ నగర్ కాలనీలో బ్లాక్ నంబర్ 13లో నివసించే అరుణ్ కుమార్ (23) ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పనిలేక ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న అరుణ్ అదే కాలనీకి చెందిన అనితను ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఉపాధిలేక ఇంటిపట్టునే ఉన్న అరుణ్.. తన ప్రియురాలిని కలిసేందుకు సోమవారం ఆమె వద్దకు వెళ్లాడు. అపుడు వారిమధ్య చిన్నపాటి గొడవ జరిగింది. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అరుణ్ కుమార్ ఇంట్లోని ప్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అనిత తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు తీవ్రంగా గాయపడిన అనితను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు