ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన పాపినాయుడు (27) అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు గత యేడాది ఏప్రిల్ నెలలో అదే గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైంది. ఈ నెల 17వ తేదీన ఇంటి వద్ద భార్యకు సీమంతం చేశారు. అనంతరం స్నేహితులను కలిసేందుకు అచ్యుతాపురానికి వెళ్లి తిరిగి బైకుపై వస్తుండగా రాజుగారి కొబ్బరితోట వద్ద రోడ్డుపై రైతులు మొక్కజొన్న కంకుల ఆరబెట్టి ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
దీంతో కిందపడిన పాపినాయుడు తలకు బలమైన గాయమైంది. ఆయనను విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ ఇంట దీపాల పండుగ రోజున చీకట్లు అలముకున్నాయి. కాగా, గత 2012లో పాపినాయుడు తండ్రి కూడా ఇదే తరహా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.