భార్య మాటను పెడచెవిన పెట్టి విహార యాత్ర - ప్రాణాలు కోల్పోయిన గాయకుడు

ఠాగూర్

బుధవారం, 8 అక్టోబరు 2025 (13:19 IST)
కట్టుకున్న భార్య చెప్పిన మాట వినకుండా విహార యాత్రకు వెళ్లిన ఓ పంజాబీ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పేరు రాజ్‌వీర్ జవాండా. భార్య వద్దన్నా వినకుండా విహార యాత్రకు వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆయన 11 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
పంజాబీ గాయకుడు మృతి వెనుక ఏం జరిగిందో పరిశీలిస్తే .. జవాండా తన 1300 సీసీ మోటారు సైకిల్‌పై ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌లోని శిమ్లాకు విహారయాత్రకు బయలుదేరారు. సోలన్‌ జిల్లా సమీపంలో అడ్డుగా వచ్చిన పశువులను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఆయన తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. 
 
పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 11 రోజులుగా ఆయన వెంటిలేటర్‌ పైనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, విహారయాత్రకు వెళ్లొద్దని జవాండా భార్య ముందుగానే హెచ్చిరించినట్లు తెలుస్తోంది. ఆమె మాటలు జవాండా వినలేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. 
 
ఇక, గాయకుడి మృతిపై ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా సహా పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తంచేశారు. జవాండా లుథియానా జాగ్రావ్‌లోని పోనా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన పంజాబీలో పలు పాటలు పాడారు. పాటలు పాడటమే కాకుండా ‘సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌’, ‘జింద్‌ జాన్‌’, ‘మిండో తసీల్‌దర్ని’ వంటి చిత్రాల్లోను నటించారు. 

వెబ్దునియా పై చదవండి