పవన్ గారూ స్పందించాలి.. ఇది సైలెంట్‌గా ఉండే సమయం కాదు : గంటా

మంగళవారం, 9 మార్చి 2021 (12:14 IST)
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మడం ఖాయమని, ఇందులో మరోమాటకు తావులేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. పైగా, ఈ కర్మాగారానికి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం (వాటా) లేదని ఆమె పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు ఆంధ్రా ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డంగా తెగనమ్మి ప్రైవేట్ పరం చేయాలని భావిస్తోందంటూ మండిపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో వైజాగ్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు మంగళవారం మాట్లాడుతూ, విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 'కేంద్రం వైఖరిపై ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదని తప్పుదోవ పట్టించారు. రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. ప్రైవేటీకరణపై ఆర్థికమంత్రి ముగిసిన అధ్యాయమన్నారు. 
 
సీఎంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరణకు భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలి. ప్రధానితో అపాయింట్‌మెంట్‌లో సీఎం ఎందుకు ప్రస్తావించలేదు. ఢిల్లీలో పాదయాత్రకు మేము సిద్ధం అందరూ కలిసిరావాలి. విశాఖ ఉక్కుపై పవన్‌ కల్యాణ్‌ స్పందించాలి. కార్మికుల తరపున పవన్‌ పోరాడాలి. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. రాజీనామా చేస్తే తెదేపా పోటీ పెట్టదు. కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరుతున్నా' అని గంటా శ్రీనివాస రావు కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు