మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డిని ఈ నెల మూడో తేదీన అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను వెంటనే విడుదల చెసినట్టు చెప్పారు. ఈ నెల మూడో తేదీన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది.
తెలంగాణ హైకోర్టు గత నెల 31వ తేదీన అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను అరెస్టుచేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు సాంకేతికంగా అరెస్టు చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సీబీఐ.. అవినాశ్ రెడ్డి వర్గాలు జాగ్రత్త వహించాయి.