వైకాపాకు ఎంపీ అభ్యర్థుల కొరత... 22 స్థానాలపై కసరత్తు!?

ఠాగూర్

శుక్రవారం, 5 జనవరి 2024 (15:02 IST)
ఏపీలోని అధికార వైకాపా తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను కేవల మూడు చోట్ల మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. 
 
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం వైకాపా పెద్దలు అన్వేషిస్తున్నారు. 
 
ఆ పార్టీ సీనియర్ నేతలైన విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిలతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు గత 25 రోజులుగా తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైవున్నారు. సీఎం జగన్ వారితో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దాదాపు 92 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత నెలకొందని వారిస్థానంలో కొత్తవారిని నియమించి ఎన్నికల్లో గెలవాలని జగన్ భావిస్తున్నారు. కానీ అంతమంది సమర్థులు దొరకడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులకు తీవ్ర కొరత ఉంది. అరకు ఎంపీ మాధవి స్థానంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఇన్చార్జిగా నియమించారు. 
 
గోరంట్ల మాధవ్ స్థానంలో బళ్లారి బీజేపీ నేత శ్రీరాములు సోదరి శాంతను తీసుకొచ్చారు. తలారి రంగయ్యను కల్యాణదుర్గం ఇన్‌చార్జిగా నియమించారు. వంగా గీతను పిఠాపురం, మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ ఇన్‌చార్జిలుగా నియమించారు. మిగతా స్థానాల్లో పోటీకి ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులు దొరకడం లేదంటున్నారు. 
 
అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ గురువారం క్యాంపు కార్యాలయానికి వచ్చి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. జగన్ లేని సమయంలో వీరిద్దరూ రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు