శ్రీకాకుళం జిల్లా పలాసలోని జీఎంఈ కాలనీలో గురువారం నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీని మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. వేదికపై మంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, డీసీసీబీ ఛైర్మన్ రాజేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు హెచ్.వెంకటరావు ఆశీనులయ్యారు.
అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని మిగిలిన వారంతా దిగువన కూర్చోవాలంటూ ఆహ్వానం పలికిన పార్టీ పలాస మండల అధ్యక్షుడు పైల వెంకటరావు సూచించారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ బి.గిరిబాబు కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత గిరిబాబు వేదిక పైకి వచ్చి మాట్లాడాలని పైల వెంకటరావు పలు మార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు.
పార్టీ సీనియర్ నాయకుడు హెచ్.వెంకటరావు ఆయన వద్దకు వచ్చి పిలిచారు. 'సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎజెండా ఏమిటి.. వేదికపైకి పిలవకుండా నన్ను ఎందుకు అవమానించారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కనీస గౌరవం ఇవ్వడం లేదు.. ఈ పదవులు నాకొద్దు.. అవసరమైతే ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను' అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు అనుచరులు సైతం వెళ్లిపోయారు.