కరోనావైరస్: సరకులు కొనుక్కోవడానికి ఏది సురక్షిత మార్గం? సూపర్‌ మార్కెట్టా? ఆన్‌లైన్లో ఆర్డరా?

మంగళవారం, 31 మార్చి 2020 (15:56 IST)
“కొన్ని వారాల క్రితం వరకు సూపర్ మార్కెట్‌కు వెళ్లి కేవలం అవసరమైన సరకులు మాత్రమే కొనుక్కుని వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది కాదు.” ఇవి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్న మాటలు. యూకేలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక చోట్ల లాక్ డౌన్ విధించారు. మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనుక్కోవడం కన్నా ఆన్‌లైన్లో తెప్పించుకోవడం మంచిదని ఆయన సూచించారు.

 
ఆహారానికి కావల్సిన సరకులు కొనుక్కోవడానికి ఏది సురక్షితమైన పద్దతి? ఆన్‌‌లైన్లో సరకులు ఆర్డర్ చేసుకోవడమా? లేదా మార్కెట్‌కి వెళ్లి కొనుక్కోవడమా? ఎవరైనా వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆ తుంపర్లని తాకినప్పుడు లేదా గాలి ద్వారా పీల్చినప్పుడు వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది.

 
షాప్‌కు వెళ్లి ఇతరులతో కలిసినప్పుడు వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. బయట షాప్‌కి వెళ్ళినప్పుడు మనిషికీ మనిషికీ మధ్య కనీసం ఆరు మీటర్ల దూరం ఉండడం అవసరం. చాలా మంది వ్యాపారస్తులు ఈ నిబంధనని కచ్చితంగా అమలు చేస్తున్నారు.

 
“మార్కెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం వుందని” లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ సేలి బ్లూమ్ ఫీల్డ్ అన్నారు. “సాధారణంగా షాప్‌కు వెళ్ళినప్పుడు వస్తువులు ముట్టుకోవడం తిరిగి వెనక్కి పెట్టడం, షాపింగ్ బెల్టు దగ్గర, క్యాష్ కౌంటర్, ఏటిఎం, బిల్లులు తీసుకున్నప్పుడు, కారు పార్కింగ్ దగ్గర చేతులు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా, చాలామంది మనుషులకి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది” అని వివరించారు.

 
ఈ ముప్పును ఎలా నివారించవచ్చు ?
షాపింగ్‌కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత సానిటైజర్‌తో కానీ, సబ్బునీటితో కానీ 20 సెకండ్ల పాటు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి.

షాపింగ్ ట్రాలీలు, బాస్కెట్లు, వస్తువులు చేతితో ముట్టుకున్న తర్వాత మీ ముఖాన్ని తాకవద్దు.
 
మీరు చేసే నగదు చెల్లింపులు కూడా దేనిని తాకకుండా చేసేటట్టు చూడండి.
 
షాపింగ్ సంగతి ఏమిటి?
 
ఆహారం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే బాగా ఉడికించి వండిన ఆహారం వైరస్‌ని హరిస్తుంది. ఆహార భద్రత గురించి యూకే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ తమ వెబ్సైటులో కొన్ని సూచనలు పొందుపర్చింది.

 
ఆహారం నుంచి వైరస్ ముప్పు లేదని పూర్తిగా చెప్పలేకపోయినప్పటికీ ఆహారం ప్యాకేజ్ చేసిన విధానం వలన ముప్పు ఉండవచ్చని ప్రొఫెసర్ బ్లూమ్ ఫీల్డ్ అన్నారు. ప్యాకేజింగ్ వలన ముప్పు లేదని, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. అయితే కొంతమంది నిపుణులు మాత్రం ఆహార భద్రత గురించి కొన్ని సలహాలు ఇస్తున్నారు.

 
ప్యాక్ చేసిన వస్తువులు వాడే ముందు కనీసం 72 గంటలు నిల్వ ఉంచి వాడటం కానీ, లేదా వాటిని వాడే ముందు కవర్లతో సహా ఇంట్లో వాడే బ్లీచింగ్తో శుభ్రం చేసి, కవర్లని తొలగించి వాడవచ్చని ప్రొఫెసర్ బ్లూమ్ ఫీల్డ్ సూచించారు. ప్లాస్టిక్‌తో ప్యాక్ చేయని వస్తువులని బాగా కడిగి, ఆరబెట్టి వాడుకోవచ్చని తెలిపారు.

 
ఆన్‌లైన్లో సరకులు తెప్పించుకోవడం ఎంత వరకు సురక్షితం?
నిర్ణీత సమయాలలో సరుకులు డెలివరీ ఇంటివద్దనే తీసుకోవడం షాప్‌కి వెళ్ళి కొనుక్కోవడం కన్నా సురక్షితమైన పద్ధతి. డెలివరీ చేసిన వ్యక్తి ద్వారా కానీ ప్యాకేజింగ్ వలన కాని వైరస్ వచ్చే అవకాశం ఉంది.
 
 
“సరకు డెలివరీ చేసే వ్యక్తిని మీ ఇంటి గుమ్మం వద్ద ప్యాకెట్ పెట్టి బెల్ కొట్టి వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పవచ్చు. ఆ తర్వాత మీ సరుకులను మీరు తీసుకోవచ్చని”, డాక్టర్ లిసా అకెర్లే సూచిస్తున్నారు.

 
వృద్ధులకు సహాయం చేస్తున్న వాలంటీర్ల సంగతి ఏమిటి?
కవర్ల మీద ఉండే వైరస్‌ను ఇంట్లో వాడే బ్లీచింగ్‌తో ఒక్కసారి శుభ్రం చేస్తే వైరస్ ఒక నిమిషంలో చనిపోతుందని వార్విక్ మెడికల్ స్కూల్‌కి చెందిన డాక్టర్ జేమ్స్ గిల్ సలహా ఇస్తున్నారు. మీ స్నేహితులు కానీ, వాలంటీర్లు కానీ సరుకులు తేవడం కన్నా ఆన్లైన్లో మీకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవడం ఉత్తమమైన మార్గమని మరొక వైరాలజీ నిపుణుడు అన్నారు.

 
అనేక ప్రాంతాలలో విధించిన లాక్ డౌన్‌తో చాలా మంది ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపారులు తమ వ్యాపారాలని 'టేక్ అవే' గా మార్చేశారు. దీంతో ఏ రోజుకారోజు ఆహారం వండి సరఫరా చేసే అవకాశం ఉంది. బయట నుంచి ఆహారం తెచ్చుకున్న వెంటనే కవర్ల లోంచి తీసి శుభ్రమైన గిన్నెలోకి తీసుకుంటే ముప్పు తగ్గుతుందని బ్లూమ్ ఫీల్డ్ సలహా ఇచ్చారు.

 
"ఆహారాన్ని చేతులతో కాకుండా స్పూన్, ఫోర్క్ వాడి తింటే మంచిదని" సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చల్లటి ఆహారం తినే కన్నా వేడిగా వండుకున్న ఆహారం తింటే మంచిదని చెప్పారు. అయితే, ఆహారం నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని, బయట లభించే రెడీ టూ ఈట్ ఆహరం పూర్తిగా మానేయవల్సిన పని లేదని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ చెప్పింది.

 
జాగ్రత్తగా వండిన ఆహారం తినడం చాలా ముఖ్యమని, ఉదాహరణకి బయట నుంచి తెచ్చుకున్న పిజ్జా లాంటివి ఒకసారి మైక్రోవేవ్ ఒవన్లో వేడి చేసుకుని తినడం మంచిదని బ్లూమ్ ఫీల్డ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు