డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన పని లేదు... ఇలా చేస్తే చాలు

గురువారం, 3 అక్టోబరు 2019 (17:35 IST)
దిల్లీలోని వసుంధరా ఎన్‌క్లైవ్‌లో ఉండే దినేష్ మదన్‌ సెప్టెంబర్‌ 2వ తేదీన స్కూటీపై గురుగ్రామ్‌కి వెళ్లారు. గురుగ్రామ్ జిల్లా కోర్టు బయట ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్-PUC, ఇన్సూరెన్స్ పేపర్లు చూపించమని అడిగారు. కానీ దినేష్ వద్ద డాక్యుమెంట్స్ ఏవీ లేవు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దాంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కొత్త చట్టం ప్రకారం ఆయనకు 23 వేల రూపాయల జరిమానా విధించారు.

 
డాక్యుమెంట్లు ఇంటి దగ్గర ఉన్నాయని.. వాట్సాప్‌లో ఆర్సీ చూపించినా పోలీసులు ఒప్పుకోలేదని దినేష్ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. 'తన స్కూటీ విలువ 15 వేలకు మించదని, కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం 23వేల రూపాయల ఫైన్ వేశారు' అని దినేష్ వాపోయాడు. కానీ, దినేష్‌ ఆ డాక్యుమెంట్లను రెండు యాప్స్‌లో సేవ్ చేసుకుని ఉండుంటే ఈ జరిమానాల నుంచి బయటపడి ఉండేవాడు. అవే ఒకటి ఎంపరివాహన్. రెండోది డిజి లాకర్. ఈ రెండు యాప్స్ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినవే.

 
ఎంపరివాహన్‌ యాప్‌తో ప్రయోజనాలేంటి?
ఎంపరివాహన్‌ యాప్‌తో ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులు పర్సులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆన్‌లైన్‌లో వీటిని వాడుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ఇవి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలతో సమానం. 

 
ఈ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్‌ కాపీలను కూడా హార్డ్‌ కాపీలుగానే భావిస్తారు. ఎందుకంటే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటాబేస్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్ అయ్యే ఈ కాపీలపై డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. పోలీసులు అడిగినప్పుడు ఎంపరివాహన్ యాప్‌లో వాటిని చూపిస్తే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. అయితే, ఫోన్‌లో ఫొటో తీసి లేదా స్కాన్ చేసి పెట్టుకుంటే ఆ డాక్యుమెంట్లు చెల్లుబాటు కావు.

 
ఈ యాప్‌ ద్వారా వాహనం ఏదైనా దాని బేసిక్ వివరాలు తెలుసుకోవచ్చు. అంటే వాహనం ఎవరి పేరు మీద ఉంది.. ఏ ప్రాంతానికి చెందినది.. ఎప్పుడు రిజిస్ట్రర్ అయింది.. ఏ మోడల్‌ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసి పైనున్న సెర్చ్ బార్‌లో వాహనం నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో క్యూర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని వాహనంపై స్టిక్కర్‌గా అతికించుకోవచ్చు. ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో పాటు సమీపంలో ఉన్న ఆర్టీవో ఆఫీసుల వివరాలు కూడా పొందొచ్చు.

 
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఈ యాప్‌ ద్వారా ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే పోలీసులు-అంబులెన్స్‌ సిబ్బంది సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా ఘటన స్థలానికి చేరుకుంటారు. ఈ యాప్‌తో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి ఫోటోలు తీసి పంపితే పోలీసులు వారికి కొరియర్‌లో చలానాలు పంపిస్తారు.

 
ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి
ఎంపరివాహన్‌ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలంటే ఫోన్‌ నెంబర్ ఉంటే సరిపోతుంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొత్తవాళ్లు సైన్ అప్ ఆప్షన్ ఎంచుకుని ఫోన్‌ నెంబర్‌ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్‌కి వచ్చిన ఓటీపీని టైప్ చేసి, పేరు ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత పై భాగంలో ఉన్న ఆర్సీ, డీఎల్‌ ఆప్షన్లలో ఏది కావాలో అది ఎంచుకుని అడిగిన వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది.

 
డిజి లాకర్
సాధారణంగా మనం విలువైన వస్తువులను లాకర్‌లో దాచుకుంటాము. అలాగే విలువైన డాక్యుమెంట్లను దాచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లాకర్‌ తీసుకొచ్చింది. అదే డిజిలాకర్ యాప్. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డులను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. వీటితో పాటు మరెన్నో సర్టిఫికెట్లను వర్చువల్‌గా సేవ్ చేసుకోవచ్చు. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. షేర్ చేయవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వీటిని చూపించొచ్చు.

 
డిజి లాకర్‌లో ఉన్న ఆధార్ కూడా ఒరిజినల్ ఇ-ఆధార్‌ కిందే లెక్క. అంటే ఎలక్ట్రానిక్ ఆధార్ చెల్లుబాటైన ప్రతిచోట డిజి లాకర్‌లోని ఆధార్‌ కూడా పనిచేస్తుంది. డిజీ లాకర్‌లో ఉన్న ఆధార్‌ని ఇతర డాక్యుమెంట్లలాగే షేర్ చేసుకోవచ్చు.

 
ఎలా నమోదు చేసుకోవాలి
గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిజి లాకర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓటీపీతో మొబైల్ నెంబర్‌ని వెరిఫై చేసుకోవాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డు నమోదు చేస్తే డిజి లాకర్ అకౌంట్ క్రియేట్ అయినట్లే. ఆ తర్వాత ఆధార్ నెంబర్‌ని ఈ యాప్‌కి అనుసంధానం చేసుకోవాలి. ఆ తర్వాత డాష్‌బోర్డులో ఉన్న క్విక్ లింక్స్ ద్వారా అడిగిన వివరాలు ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పాన్ కార్డులను డిజిటల్ రూపంలో పొందొచ్చు.

 
అయితే, ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీతో మ్యాచ్ కావాలి. అప్పుడే డిజిటల్ కార్డులు వస్తాయి. ఒకసారి యూజర్ ఐడీ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మార్చుకునే వీలు లేదు. అలాగే, యూజర్‌ ఐడీతో ఆధార్ అనుసంధానమైన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం కూడా లేదు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మర్చిపోతే ఆధార్ నెంబర్‌ సాయంతో తిరిగి పొందొచ్చు.

 
అకౌంట్‌ని డిలీట్ చేసే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. కానీ డిజి లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న డాక్యుమెంట్ల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

 
ఎంత వరకు సేఫ్?
డిజి లాకర్ పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం చెబుతోంది. అప్‌లోడ్ చేసిన డేటా ఇతరుల చేతికి చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించింది. డిజి లాకర్ 256 బిట్ సెక్యూర్ సాకెట్ లేయర్ - SSL ఎన్‌క్రిప్షన్ ఉపయోగిస్తోంది. డిజి లాకర్‌ అకౌంట్‌లోకి లాగినయ్యే ప్రతిసారీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది.


ఆధార్ అథెంటికేషన్ తర్వాత మాత్రమే యూజర్లకు డాక్యుమెంట్లను జారీ చేస్తారు. అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ డిజిటల్ కాపీలు కావాలంటే ముందుగా ఆధార్‌ అథెంటికేషన్ చేసుకోవాలి. వీటితో పాటు మరెన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సెప్టెంబర్ 25 నాటికి 29.71 మిలియన్ల మంది డిజి లాకర్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. 3.53 బిలియన్ల డాక్యుమెంట్లు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు