రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఎవరు

శనివారం, 14 జనవరి 2023 (23:08 IST)
కర్టెసి-ట్విట్టర్
‘నేను ఇప్పుడే దేవున్ని కలిశాను.’ కొద్ది గంటల కింద టాలీవుడ్ సినిమా దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఇది. మహేశ్ బాబుతో రాజమౌళి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కథ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉంటుందని రాజమౌళి ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఆ ‘ఇండియానా జోన్స్’ సినిమాలకు దర్శకత్వం వహించింది రాజమౌళి ‘దేవుడు’ అని పిలిచిన వ్యక్తే.  
 
ఆ వ్యక్తి ఎవరో కాదు స్టీవెన్ స్పీల్‌బర్గ్. హాలీవుడ్‌లో ఫేమస్ సినిమా దర్శకుడు. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి ఫేమస్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అమెరికాలోని ఓహియోలో 1946లో స్టీవ్ స్పీల్‌బర్గ్ జన్మించారు. ఆయన తండ్రి ఆర్నాల్డ్ స్పీల్‌బర్గ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. స్పీల్‌బర్గ్ తల్లిదండ్రులు రష్యన్ యూదు సంతతికి చెందిన వారు. న్యూజెర్సీ, అరిజోనా, కాలిఫోర్నియాలలో ఆయన బాల్యం గడిచింది. సినిమాల మీద ఆసక్తితో స్కూలు చదువు మధ్యలోనే ఆపేశారు.
 
16ఏళ్ల వయసులోనే
టీనేజీ వయసు నుంచే స్పీల్‌బర్గ్ సినిమాలు తీయడం ప్రారంభించారు. తొలుత చిన్నచిన్న డాక్యుమెంటరీలు తీసిన ఆయన, 16 ఏళ్ల వయసులో తొలి ఫీచర్ సినిమా ఫైర్‌లైట్(1963) తీశారు. 18 ఏళ్ల వయసులో సినిమాల గురించి మరింత నేర్చుకునేందుకు లాస్‌ఏంజలీస్‌కు ఆయన వెళ్లిపోయారు. అక్కడ యూఎస్‌సీ ఫిలిం స్కూల్లో చేరేందుకు ప్రయత్నించినా ఆయనకు అడ్మిషన్ లభించలేదు. స్కూల్లో ఆయన గ్రేడ్స్ చాలా పూర్‌గా ఉండటం వల్ల ఆ సంస్థ అడ్మిషన్ ఇవ్వలేదు.

 
ఫిలిం స్కూల్లో అడ్మిషన్ రాకపోవడంతో యూనివర్సల్ స్టూడియోలో ఇంటర్న్‌గా స్పీల్‌బర్గ్ చేరారు. అదీ జీతం లేకుండానే. కొన్నాళ్ల తరువాత అక్కడ టీవీ షోలు డైరెక్ట్ చేయడం ప్రారంభించారు. 1971లో స్పీల్‌బర్గ్ తీసిన టీవీ కోసం తీసిన థ్రిల్లర్ చిత్రం డ్యుయల్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. 1975లో తీసిన ‘జాస్’ సినిమా ఆయనను కెరియర్‌లో మరొక మెట్టు పైకి ఎక్కించింది. ఆ సినిమాకు మూడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 1993లో వచ్చిన ‘జురాసిక్ పార్క్’తో ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు.  

 
మూడు ఆస్కార్ అవార్డులు
ప్రపంచసినిమా రంగంలో ఆస్కార్ అవార్డులను అత్యున్నత పురస్కారాలుగా చూస్తారు. జీవితంలో ఒక్క ఆస్కార్ అవార్డు అయినా గెలుచుకోవాలని కలలు కనే వారు చాలా మంది ఉంటారు. ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడాన్నే గొప్పగా భావించే వాళ్లూ ఉంటారు. అలాంటిది స్పీల్‌బర్గ్ మాత్రం మూడు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

 
ఇండియానా జోన్స్
1981 నుంచి మొదలైన ఇండియానా జోన్స్ సిరీస్ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్‌లోని నాలుగు సినిమాలకు స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించారు.
ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రాల్లో హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు. 1989లో వచ్చిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ సినిమాను భారత్‌లోని మంత్రాలు, తంత్రాలు, నరబలులు వంటి వాటి కేంద్రంగా చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమరీశ్ పురీ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

 
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సంపన్నులైన హాలీవుడ్ దర్శకుల్లో స్పీల్‌బర్గ్ ఒకరు. ప్రస్తుతం ఆయన సంపద 4 బిలియన్ డాలర్లగా ఉంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు 10 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి. 1993లో వచ్చిన ‘జురాసిక్ పార్క్’తో స్పీల్‌బర్గ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఐఎండీబీ ప్రచురించిన ‘ఆల్ టైం బెస్ట్ హాలీవుడ్ మూవీస్’ జాబితాలో ఈ సినిమా కూడా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు