చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?

బుధవారం, 8 జులై 2020 (14:23 IST)
1962లో చైనా దాడి చేసిన సమయంలో వారి సైనికుల సంఖ్య భారత్ కంటే రెట్టింపు ఉండడమే కాదు, వారి దగ్గర మెరుగైన ఆయుధాలు కూడా ఉన్నాయి. అప్పుడు వారు యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గర సరుకులకు కూడా లోటు లేదు. అన్నిటినీ మించి అనుభవజ్ఞుల నాయకత్వంలో వారు ఆ దాడి చేశారు. పదేళ్ల క్రితం కొరియాతో జరిగిన యుద్ధంలో వారు రాటుదేలి ఉన్నారు.

 
వాలాంగ్‌లో భారత్‌కు మొదటి దెబ్బ తగిలింది. ఆ తర్వాత సేలా పాస్ కూడా చేజారిపోతోంది. ఆ ప్రాంతం అంతా కలిపి పది, పన్నెండు వేల మంది భారత జవాన్లు ఉంటారు. వారు 18 నుంచి 20 వేల మందితో ఉన్న చైనా ఆర్మీని ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత జవాన్ల దగ్గర మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఇన్‌ఫీల్డ్ రైఫిళ్లు ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చిన ఆటోమేటిక్ రైఫిళ్లు సైన్యం దగ్గరకు చేరాయి. కానీ వాటిని ఇంకా ప్యాకింగ్ పెట్టెల్లోంచి బయటకు కూడా తీయలేదు.

 
సైనికులకు ఆ తుపాకులతో ఎలా పోరాడాలో ఇంకా శిక్షణ ఇవ్వలేదు. సేలా తర్వాత చైనా బొండిలా నగరంవైపు ముందుకొస్తోంది. అప్పటికే భారత్‌లోని మొత్తం 32వేల చదరపు మైళ్ల భూభాగం చైనా నియంత్రణలోకి వచ్చింది. అప్పటి పరిస్థితి గురించి నెవిల్ మాక్స్ వెల్ తన ‘ఇండియాస్ చైనా వార్’ పుస్తకంలో చెప్పారు. “పరిస్థితులు ఎంత ఘోరంగా మారాయంటే, చైనాను ఎదుర్కోడానికి భారత్‌కు సాయం చేసేలా కొన్ని విదేశీ సేనలను పిలిపిస్తే బాగుంటుందని భారత కమాండర్ బీజీ కౌల్ నెహ్రూతో అన్నారు” అని రాశారు.

 
ఆ సమయంలో భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న గాల్‌బ్రెథ్ తన ఆత్మకథ ‘ఎ లైఫ్ ఇన్ అవర్ టైమ్స్’లో ఇలా రాశారు. “అన్ని స్థాయిల్లో భారతీయులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సైన్యం ఉపయోగించడానికి వీలుగా భారత్ అంతటా ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు రద్దు చేశారు. అసోంలోనే కాదు బంగాల్, కోల్‌కతాకు కూడా ముప్పు పొంచివుంది”.

 
కెనడీకి రెండు లేఖలు రాసిన నెహ్రూ
ఆలోపు నెహ్రూ అమెరికా అధ్యక్షుడు కెనడీకి నవంబర్ 19న రెండు లేఖలు రాశారు. వాటిని వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయం నుంచి నేరుగా వైట్‌హౌస్‌కు పంపించారు. వీటిని, ముఖ్యంగా రెండో లేఖను అప్పుడు బహిరంగపరచలేదు. తర్వాత గాల్‌బ్రెథ్ తన డైరీలో “సాయం కోరుతూ మాకు ఒకటి కాదు, రెండు అభ్యర్థనలు వచ్చాయి. రెండో దానిని చాలా రహస్యంగా ఉంచారు. ఈ లేఖలు నేరుగా అధ్యక్షుడు చదవడానికే వచ్చాయి.(ఫర్ హిజ్ ఐస్ ఓన్లీ) ఆ తర్వాత వాటిని చించేశారు” అని రాశారు.

 
ఆ తర్వాత ఎన్నో భారత ప్రభుత్వాలు అలాంటి లేఖ ఉనికి గురించి చెప్పడానికి నిరాకరించాయి. కానీ ప్రముఖ జర్నలిస్ట్ ఇందర్ మల్హోత్రా ఇండియన్ ఎక్స్ ప్రెస్‌కు 2010 నవంబర్ 15న రాసిన ‘జేఎన్ టూ జేఎఫ్‌కే’ ఆర్టికల్‌లో ఆ విషయం చెప్పారు. “తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి, ప్రధాన మంత్రి కార్యాలయంలో, విదేశాంగ శాఖ కార్యాలయంలో ఉన్న అన్ని రికార్డులు తనిఖీ చేయించామని, అలాంటి పత్రాలు ఉన్నట్టు తమకు ఎలాంటి ఆధారం లభించలేదన్నారు” అని తెలిపారు.

 
అమెరికా విదేశాంగ శాఖ మాత్రం "తమ ఆర్కైవ్స్ లో ఈ లేఖల ప్రస్తావన ఉందని, కానీ.. వాటిని రహస్యంగా ఉంచినట్లు అందులో రాశారని” అంగీకరించింది. కానీ, 2010లో జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం ఆ లేఖలను బహిరంగపరిచింది.

 
ఈ లేఖల గురించి మంత్రులకు కూడా తెలీదు
ఆ లేఖలో “చైనీయులు నెఫాలో చాలా పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు. వారు లద్దాఖ్‌లో చుశాల్‌ను కూడా ఆక్రమించుకోబోయారు” అని నెహ్రూ రాశారు. “చైనా దాడిని ఎదుర్కోడానికి భారత్‌కు రవాణా, యుద్ధ విమానాలు అవసరం” అని రాసిన నెహ్రూ చివర్లో ఇలాంటి లేఖను బ్రిటన్ ప్రధాని హారోల్డ్ మెక్‌మిలన్‌కు కూడా పంపిస్తున్నానని చెప్పారు.

 
ఈ లేఖ వైట్ హౌస్‌కు చేరేలోపే గాల్‌బ్రెథ్ అమెరికా అధ్యక్షుడు, విదేశాంగ, రక్షణ మంత్రులకు ఒక టాప్ సీక్రెట్ టెలిగ్రాం పంపించారు. అందులో “నెహ్రూ మీకు ఒక లేఖ పంపించబోతున్నారని నాకు రహస్య సమాచారం అందింది. దాని గురించి ఆయన తన మంత్రులకు కూడా చెప్పలేదు” అని ఉంది. అమెరికాలో భారత రాయబారి బీకే నెహ్రూ ఆ లేఖను స్వయంగా తీసుకెళ్లి అధ్యక్షుడు కెనడీ చేతికి అందించారు.

 
12 స్క్వాడ్రన్ల విమానాలు అడిగారు
రెండో లేఖలో “మీకు మొదటి లేఖ రాసిన కొన్ని గంటల్లోనే నెఫాలో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. బ్రహ్మపుత్ర లోయ అంతటా తీవ్ర ప్రమాదం ముంచుకొచ్చింది. మీరు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే.. అసోం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ అన్నీ చైనా చేతిలోకి చేరుతాయి” అని నెహ్రూ రాశారు.

 
“మాకు కనీసం 12 స్కాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలి. మా పైలట్లు వాటిని నడపగలిగేలా శిక్షణ పొందేవరకూ అమెరికా పైలట్లే వాటిని నడపాలి. అమెరికా పైలట్లను భారత నగరాలు, స్థావరాల రక్షణకు ఉపయోగించుకుంటాం. కానీ టిబెట్ లోపల వైమానిక దాడులను, భారత వైమానిక దళమే చేస్తుంది. వాటికోసం మాకు రెండు స్క్వాడ్రన్ల బి-47 బాంబర్లు కూడా కావాలి” అని స్పష్టంగా కోరారు. నెహ్రూ ఆ ఆయుధాలను చైనా మీద మాత్రమే ప్రయోగిస్తామని, పాకిస్తాన్‌పై వాటిని ఎప్పటికీ వాడమని కెనడీకి హామీ ఇచ్చారు.(జాన్ ఎఫ్ కెనడీ ప్రెసెడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం, నెహ్రూ కరెస్పాండెన్స్, నవంబర్ 19-11-1962)

 
బీకే నెహ్రూ కూడా ఆ లేఖకు ఇబ్బందిపడ్డారు
రెండో లేఖలో నెహ్రూ నిజానికి కెనడీని 350 యుద్ధ విమానాలు అడిగారు. వాటిని నడపాలంటే కనీసం 10 వేల మంది సపోర్ట్ స్టాఫ్ అవసరం అవుతారు. డెనిస్ కుక్ తన ‘ఇండియా అండ్ ద యునైటెడె స్టేట్స్: ఎస్ట్రేం‌జ్డ్ డెమాక్రసీస్’ పుస్తకంలో దాని గురించి రాశారు. “అమెరికాలో భారత రాయబారి బీకే నెహ్రూ ప్రధానమంత్రి రాసిన లేఖలను చూసి ఎంత షాక్ అయ్యారంటే, ఆయన వాటిని తన సిబ్బందికి ఎవరికీ చూపించలేదు. దానిని తన టేబుల్ డ్రాయర్‌లో ఉంచేశారు. తర్వాత ఒక చరిత్రకారుడితో మాట్లాడిన ఆయన, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాకే ప్రధాని ఆ రెండు లేఖలూ రాసి ఉంటారని చెప్పారు”

 
తర్వాత బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్‌’లో “ ప్రధాని నెహ్రూ రాసిన మొదటి లేఖ మన అలీన విధానానికి వ్యతిరేకం. రెండో లేఖ ఎంత దయనీయంగా ఉందంటే, దానిని చదివి నేనే ఇబ్బందిపడ్డాను, బాధను చాలా కష్టంగా నియంత్రించుకోగలిగాను” అన్నారు.

 
దిల్లీలో నిరాశ వాతావరణం
అటు దిల్లీ రూజ్‌వెల్ట్ హౌస్‌లో రాయబారి గాల్‌బ్రెథ్ “ఈరోజు దిల్లీలో అత్యంత భయంకరమైన రోజు. ప్రజల ధైర్యం ముక్కలవడం నేను మొదటిసారి చూశాను. వెంటనే ఆయుధాలు, 12-సి 130 విమానాలను వెంటనే పంపించాలని నేను వైట్‌హౌస్‌కు సందేశం పంపించాను” అని 1962 డైరీలో నవంబర్ 20 పేజీలో రాశారు. అమెరికా నావికా దళాన్ని భారత్ ఏ సాయం కోరలేదు. కానీ బంగాళాఖాతంలో ఏడో నావికా దళాన్ని మోహరించడం వల్ల సంకట స్థితిలో దానికి అమెరికా అండగా ఉందనే విషయం చైనాకు తెలుస్తుందని గాల్‌బ్రెథ్ ఆలోచించారు.

 
గాల్‌బ్రెథ్ ఇచ్చిన ఈ సలహాకు కెనడీ వెంటనే స్పందించారు. ఏడో నావికా దళాన్ని వెంటనే పంపించాలని హోనులులులో ఉన్న పసిఫిక్ ఫ్లీట్‌కు చెప్పారు. ఆ ఆదేశాలు అందగానే యూఎస్ఎస్ కిటీ హాక్ బంగాళాఖాతంలోకి చేరుకోడానికి బయల్దేరింది.

 
కెనడీ రాయబారి దిల్లీ చేరుకున్నారు
నెహ్రూ రెండు లేఖలకు జవాబుగా, భారత్ అవసరాలను అంచనా వేయడానికి కెనడీ వెంటనే ఎవరెల్ హారీమెన్‌ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి బృందాన్ని దిల్లీ పంపించారు. వెంటనే, అమెరికా వైమానికదళంలోని కేసీ 135 విమానం ఆండ్రూస్ స్థావరం నుంచి గాల్లోకి ఎగిరింది. టర్కీలో ఇంధనం నింపుకోడానికి కాసేపు ఆగిన హారిమెన్, ఆయన బృందంలోని అధికారులు 18 గంటలు ప్రయాణించాక నవంబర్ 22న సాయంత్రం 6 గంటలకు దిల్లీ చేరుకున్నారు.

 
గాల్‌బ్రెథ్ వారందరినీ విమానాశ్రయం నుంచి నేరుగా నెహ్రూ నివాసానికి తీసుకెళ్లారు. కానీ ఆలోపే నవంబర్ 21న ఉదయం ‘చాటుమాటు శాంతి సందేశం' వచ్చేసింది‘. నవంబర్ 20న రాత్రి చైనా ఏకపక్ష యుద్ధ విరమణ ప్రకటించింది. అంతేకాదు, వాస్తవాధీన రేఖ దగ్గర 1959 నవంబర్ 7న ఉన్న స్థితి నుంచి తమ సైన్యం 20 కిలోమీటర్లు వెనక్కు వెళ్తున్నట్లు కూడా చైనా ప్రకటించింది.

 
అమెరికా జోక్యంతో యుద్ధ విరమణ
ఇక్కడ, యుద్ధం విరమించాలని, నెఫా నుంచి వెనక్కు తగ్గాలని మావో ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు వస్తాయి. దాని గురించి బ్రూస్ రైడెల్ ‘జెఎఫ్‌కే'స్ ఫర్గాటెన్ క్రైసిస్: టిబెట్, ద సీఐఏ అండ్ ద సీనో- ఇండియన్ వార్‌’లో రాశారు

 
“ఈ నిర్ణయం వెనుక లాజిస్టికల్ కారణాలు ఉన్నాయి. చలికాలం మొదలవబోతోంది. టిబెట్, హిమాలయాల్లో చైనా సైన్యానికి సరుకులు పంపించడం కష్టమవుతుంది. చైనా ఎదుట సిలిగుడి నెక్‌ దాటి అసోంలో చొరబడే దారి ఒక్కటే మిగిలింది. అప్పుడు అది తూర్పు పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర్లోని ప్రాంతానికి చేరుకోవచ్చు. కానీ, అలా చేస్తే భారత్ తరఫున కెనడీ బలవంతంగా రంగంలోకి దిగేలా చేసినట్టు అవుతుందని మావో ఆలోచించి ఉంటారు” అన్నారు.

 
అమెరికా వైమానిక దళం, బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ భారత్‌కు సహాయ సామగ్రి పంపిచడంతో, ఆ దేశాలు నైతిక మద్దతుతోపాటూ సైనిక సహాయం కూడా చేస్తున్నాయనే విషయం చైనాకు అర్థమైంది. నవంబర్ నెల మధ్య వరకూ ఈ సాయం యుద్ధ మైదానంలోకి వస్తూనే ఉంది. నవంబర్ ముగిసేసరికే ఈ యుద్ధంలో భారత్ ఒంటరిగా లేదనే విషయం మావోకు తెలిసొచ్చింది. ఎంత కాలం యుద్ధం చేసినా, అమెరికా, బ్రిటన్ ఆయుధాలు భారత్‌కు అందుతూనే ఉంటాయనే విషయం స్పష్టమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు