దేశ వ్యాప్తంగా 4.08 కోట్ల నకిలీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను తొలగించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో విపక్ష సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గృహ అవసరా నిమిత్తం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు పారదర్శకంగా ఎల్పీజీ పంపిణీ, సబ్సిడీ అందేలా ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది.
పహల్ పథకం, ఆధార్ ఆధారిత ధృవీకరణ, బయోమెట్రిక్ ప్రామాణీకరణ, అనర్హమైన లేదా నకిలీ కనెక్షన్ల తొలగింపు వంటి కార్యక్రమాల అమలు ద్వారా సబ్సిడీ వ్యవస్థను బలోపేతం చేశారు. వినియోగదారుల సాధికారతను పెంచడానికి మరియు సేవలో పారదర్శకతను పెంచడానికి, దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ కేంద్రాలలో ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అమలు చేశారు.
ఈ వ్యవస్థ కింద, వినియోగదారులు సిలిండర్ రిజిస్ట్రేషన్, చెల్లింపు రసీదు, సిలిండర్ పంపిణీ గురించి సంక్షిప్త సందేశ సేవ (ఎస్ఎంఎస్) ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తారు. దీని ద్వారా, వారు తమ కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. ఏదైనా అవకతవకలు జరిగితే ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు.