2 నిమిషాల్లో రూ.200 కోట్లు ఫట్? ఎలా?

శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:53 IST)
ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ బిజినెస్‌ టైకూన్‌లలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ ఒకరు. మస్క్ కేవలం రెండే రెండు నిమిషాలలో తన సంపదలో బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో మస్క్‌ కంపెనీ అయిన టెస్లా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆయన భారీగా నష్టపోవాల్సి వచ్చింది. 
 
న్యూయార్క్ ఎక్స్ఛేంజీలో గురువారం నాడు ట్రేడింగ్ ఆరంభమైన రెండు నిమిషాలకే అంటే నిన్న ఉదయం 9.32 గంటలకే టెస్లా షేర్లు 11 శాతం నష్టంతో ట్రేడ్‌ అయ్యాయి. దీంతో ఎలన్‌ మస్క్‌ సంపద 1.1 బిలియన్‌ డాలర్లు తగ్గి 22.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 
 
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా సంస్థ విక్రయాలు భారీగా తగ్గాయి. అలాగే గతేడాది నాలుగో త్రైమాసికంలో ఆ సంస్థ అమ్మకాలు 90,966 యూనిట్లుగా ఉండగా... ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెస్లా 63,000 వాహనాలను మాత్రమే విక్రయించింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌ మొత్తంలో టెస్లా షేర్లు 8శాతం నష్టపోయాయి.
 
బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఎలన్‌ మస్క్‌ సంపద 22.3 బిలియన్‌ డాలర్‌లుగా ఉంది. ఇందులో 10 బిలియన్‌ డాలర్లను టెస్లా విక్రయాల నుంచే పొందేవారు. మిగతా సంపద స్పేస్‌ ఎక్స్‌ నుంచి వస్తోంది. ప్రముఖ రాకెట్‌ లాంచింగ్‌ సంస్థ స్పేస్‌ ఎక్స్‌ను కూడా ఎలన్‌ మస్కే స్థాపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు