వార్షిక బడ్జెట్ ఎఫెక్ట్ : రోజురోజుకూ తగ్గిపోతున్న బంగారం ధరలు!

సెల్వి

శనివారం, 27 జులై 2024 (12:30 IST)
ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కారణంగా దేశంలో బంగారం ధరలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. దీంతో పసిడి ధరలు ఏకంగా 7 శాతం లేదా రూ.5 వేల వరకు తగ్గిపోయాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.75,000 ఎగువున ఉన్న 10 గ్రాముల బంగారం ధర బడ్జెట్ ప్రకటన తర్వాత రూ.70,650 స్థాయికి తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.84,000 స్థాయికి పడిపోయింది. ధరలు తగ్గుదలను కొనుగోలుదారులు కూడా స్వాగతిస్తున్నారు.
 
ధరలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుండడంతో ఆభరణాల కొనుగోలు డిమాండ్ కూడా పెరిగింది. తిరిగి బంగారాన్ని కొనేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పండగల సీజన్‌కు ముందు ధరల తగ్గుదల తమకు కలిసి రావడం ఖాయమని, ఆభరణాల విక్రయాలకు మరింత ఊతం ఇస్తుందని పీసీ జ్యువెలర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కస్టమ్స్ సుంకం తగ్గింపుతో బంగారం దిగుమతులు చౌకగా మారాయి. ఈ నిర్ణయం బంగారం అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయగలదనే అంచనాలున్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగానికి లబ్ది చేకూరుతుందని, బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు