54వేల పెట్రోల్ బంకులు మూతపడనున్నాయ్.. 13న దేశ వ్యాప్తంగా బంద్..

ఆదివారం, 8 అక్టోబరు 2017 (17:28 IST)
దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడున్నాయి. డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకూ కేంద్రప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. ఈ మేరకు పెట్రో డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈ నెల 27 నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌కు దిగుతామని హెచ్చరించారు. రోజు వారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని పెట్రోలియం శాఖ ఇప్పటికీ విధివిధానాలను రూపొందించలేదని.. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకు 54వేల బంక్ యజమానుల మద్దతు కూడా ఉన్నట్లు మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ లోధ్ ప్రకటించారు. 
 
దీనికి నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవటాన్ని తప్పుబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు