నేల చూపులు చూస్తున్న పెట్రోల్ ధర - తెలుగు రాష్ట్రాల్లో మాత్రం?

శుక్రవారం, 5 నవంబరు 2021 (13:30 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు చుక్కలను తాకుతూ వచ్చాయి. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. పైగా, రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని కోరింది. దీంతో ఎన్డీయే పాలిత రాష్ట్రాలు తక్షణం తాము వసూలు చేస్తున్న పన్నును కొంతమేరకు తగ్గించింది. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి.
 
కానీ, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు పెట్రోల్‌పైన రూ.5, డీజిల్‌పైన రూ.10 మాత్రమే తగ్గుతుంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపునకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తగ్గింపు మాత్రమే అమలు జరుగుతుంది. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 
 
ఈ కారణంగా కేంద్ర ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రంలో వ్యాట్ తగ్గడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై 12.79 చొప్పున తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కు, డీజిల్ రూ.107.40 నుంచి రూ.94.61లుగా ఉన్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు