సీతమ్మ పుట్టిన గడ్డ.. రావణ లంకలో పెట్రోల్ రేట్లు తక్కువ.. మరి రాముడు జన్మభూమిలో...

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:16 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ రేట్లు సెంచరీ కొట్టాయి. మరికొన్ని రాష్ట్రాల్లో వంద రూపాయలకు చేరువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, రాజ్యసభలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషద్ పెట్రోల్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. 
 
'సీతమ్మ తల్లి పుట్టిన నేపాల్‌లోనూ, రావణుడి లంకలోనూ పెట్రోల్ రేట్లు తక్కువగానే ఉన్నాయి. మరి, రాముడి గడ్డ అయిన మన దేశంలో కేంద్ర ప్రభుత్వం రేట్లను ఎప్పుడు తగ్గిస్తుంది?' అని ప్రశ్నించారు. రామాయణంలోని పాత్రలను పోలుస్తూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోందంటూ ఆయన రాజ్యసభలో పెట్రోల్ ధరల విషయాన్ని ప్రస్తావించారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిచ్చారు. పొరుగు దేశాలతో భారత్‌ను పోల్చడం సరికాదన్నారు. 
 
ఆయా దేశాల్లో చాలా తక్కువ మంది మాత్రమే పెట్రోల్ వాడుతారని, మన దగ్గర అలాంటి పరిస్థితుల్లేవన్నారు. వినియోగం ఎంత పెరిగితే ధరలు అంత ఎక్కువగా ఉంటాయన్నారు. మన దేశాన్ని పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలుస్తామా? చిన్న ఆర్థిక వ్యవస్థలతోనా? అని ఎదురు ప్రశ్న వేశారు. 
 
దీనికి మంత్రి బదులిస్తూ, బంగ్లాదేశ్, నేపాల్‌లలో కిరోసిన్ ధర రూ.57 నుంచి రూ.59 దాకా ఉందని, మరి, మన దేశంలో లీటర్ కిరోసిన్ ధర కేవలం రూ.32గా ఉందని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు