ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధార్వాడ్ ఎడ్యుకేషనల్ పార్టనర్‌గా, ఎడ్యునెట్ ఫౌండేషన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఫౌండేషన్ ప్రారంభించిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అపూర్వ విజయం సాధించింది. జనవరి 2023లో హైదరాబాద్‌లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, పదోతరగతి తర్వాత విద్యను నిలిపివేసిన యువతకు అవసరమైన ఐటీ నైపుణ్యాలను అందించడానికి, తద్వారా సాంకేతికతతో నడిచే కెరీర్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా రూపొందించబడింది.
గత 18 నెలలుగా, ప్రయోగాత్మక అనుభవాలు, ప్రాజెక్ట్ వర్క్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన ఐటి నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడంపై ఈ కార్యక్రమం విజయవంతంగా దృష్టి సారించింది. మునుపెన్నడూ కంప్యూటర్‌పై పని చేయని చాలా మంది, కంప్యూటర్ పనితీరుపై ప్రాథమిక అవగాహనతో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆపై ఐటి ఆధారిత సేవలు లేదా పూర్తి స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యాన్ని ఎంచుకున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన స్నాతకోత్సవ వేడుకతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 80 మందికి పైగా విద్యార్థులను ఈ వేడుకలో సన్మానించారు. “డిజిటల్ ఎకానమీలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతిభావంతులను తీర్చిదిద్దడం అవసరం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కెరీర్‌ల కోసం తమను తాము సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ విద్యార్థులు రేపటి ఆవిష్కరణలకు దోహదపడ్డారు" అని ఎల్‌టిఐ మైండ్ ట్రీ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ పనీష్ రావు అన్నారు. "వృత్తిపరమైన విజయం వైపు వారి ప్రయాణంలో మేము ఒక పాత్ర పోషించినందుకు మేము గర్విస్తున్నాము. భవిష్యత్తులో మరింతమంది యువతను శక్తివంతం చేయడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాము" అని అన్నారు.
ఎడ్యునెట్ ఫౌండేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ. నగేష్ సింగ్ మాట్లాడుతూ, "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ద్వారా అందించబడిన ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమకు పరిచయం చేయడం మా విద్యార్థుల విజయానికి కీలకం. వారు అర్థవంతమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను పొందడం సంతోషంగా వుంది" అని అన్నారు.