కరోనా రక్కసి కోరల్లో అమెరికా.. ఒక్క రోజే 2751 మంది మృతి.. వింటర్‌లో ఫ్లూతో మళ్లీ?

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:27 IST)
corona
కరోనా రక్కసి కోరల్లో అగ్రరాజ్యం అమెరికా చిక్కుకుంది. అమెరికాను ఈ వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒకే రోజు ఏకంగా 2751 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అక్కడ మరణాల సంఖ్య 45,373కు పెరిగింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అంటే 24 గంటల్లో 40 వేల కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 8,26,240కి చేరింది.
 
ఇక అమెరికాలో కరోనా మహమ్మారి ఈ ఏడాదిలో మరోసారి విజృంభిస్తుందని 'సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌' డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనాతో పాటు ఫ్లూ కూడా అదే సమయంలో ప్రతాపం చూపుతుందని తెలిపారు. రెండు ఒకేసారి విజృంభిస్తే పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే శీతకాలంలో అమెరికాలో మరోసారి ఫ్లూ, కొవిడ్‌-19 విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 
కాగా.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే అమెరికా దారుణంగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అమెరికాపై కొవిడ్‌-19 దాడి చేస్తే మాత్రం పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు