అమెరికాలో గత పదిరోజుల్లో దాదాపు పది లక్షల కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ గణాంకాల ప్రకారం శనివారం అమెరికాలో 1,26,156 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,00,51,300కి చేరింది. గత వారంలో రోజుకి సగటున 1,06,972 కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్, భారత్‌లో నమోదవుతున్న సగటు కేసులను కలిపినా.. అగ్రరాజ్యంలో 29 శాతం కేసులు అదనంగా నమోదవుతున్నాయి.
ఇక కొత్తగా 1,013 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,38,000కు పెరిగింది. వరుసగా ఐదోరోజు వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 11 కరోనా మరణాల్లో ఒకటి అమెరికాలోనే ఉంటోంది.