భారత క్రికెట్‌లో పడిలేచిన కెరటం : గంగూలీ

Munibabu

మంగళవారం, 7 అక్టోబరు 2008 (18:47 IST)
భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లుగా చెప్పదగినవారిలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరును సైతం నిస్సందేహంగా చేర్చవచ్చు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు సాధించిన గంగూలీ కెరీర్‌లో ఎన్నో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి.

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రాణించిన గంగూలీకి ఒకానొక దశలో దేశం యావత్తూ నీరాజనాలు పలికింది. బెంగాల్ టైగర్, కోల్‌కతా ప్రిన్స్, దాదా అంటూ అభిమానులు ముద్దు పేరుతో పిల్చుకునే సౌరవ్ చండీదాస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్‌కతాలో ఆగస్ట్ ఏడు 1972లో జన్మించాడు.

అటుపై 1992 జనవరి 11న బ్రిస్‌బేన్‌లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. తొలి మ్యాచ్‌లో కేవలం మూడే పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన గంగూలీ అటుపై కెరీర్‌లో అందరూ మెచ్చుకోదగ్గ స్థాయిలో రాణించడం విశేషం.

అలాగే 1996లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గంగూలీ ఇప్పటికే నూరు టెస్టులు పూర్తి చేసుకోవడం విశేషం. ఆటగాడిగా టెస్టుల్లో ఇప్పటివరకు 6888 పరుగులు సాధించిన గంగూలీ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 15 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు ఉన్నాయి.

దీంతో పాటు ఇప్పటివరకు 311 వన్డేలాడిన గంగూలీ 22 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలతో పాటు 11363 పరుగులు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాక తాను ఆడిన టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు సాధించి బౌలింగ్‌లోనూ తన సత్తా చాటడం విశేషం. ఆటగాడిగా ఇంతటి పేరు సాధించిన గంగూలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జట్టును విజయ పథంలో నడిపించాడు.


ఇప్పటివరకు భారత జట్టుకు సారథ్యం వహించిన ఏ కెప్టెన్ కూడా సాధించని రెండు విజయాలను గంగూలీ సాధించగలిగాడు. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గానే కాకుండా ప్రత్యర్థికి తన ప్రవర్తనతో కూడా సమాధానం చెప్పగల్గడం గంగూలీ ప్రత్యేకత. కెప్టెన్‌గా భారత్‌కు గంగూలీ అత్యధికంగా 21 టెస్ట్ విజయాలు అందించాడు.

అలాగే వన్డేల్లోనూ కెప్టెన్‌గా తనకెవరూ సాటిరారని నిరూపించాడు. వీటితోపాటు గంగూలీ కెరీర్‌లో మరెన్నో విశేషాలున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా గంగూలీ తిరుగులేని రికార్డు సాధించాడు. మైదానంలో మెత్తగా కన్పించే భారత కెప్టెన్‌ల తీరుకు వ్యతిరేకంగా ఎలాంటి భావోద్వేగాన్నైనా అందరిముందూ ప్రదర్శించగల్గడం కెప్టెన్‌గా ఒక్క గంగూలీకే చెల్లింది.

ఒకానొక దశలో కెప్టెన్సీ పదవితో పాటు జట్టులో స్థానాన్ని కూడా గంగూలీ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇక గంగూలీ పని అయిపోయిందంటూ అందరూ విమర్శించడం మొదలు పెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఏమాత్రం నిరుత్సాహం చెందని గంగూలీ 2006-07లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌తో పునఃప్రవేశం చేసి తన సత్తా నిరూపించాడు.

మూడు టెస్టుల ఈ సిరీస్‌లో గంగూలీ 214 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అందుకే భారత క్రికెట్ గురించి చెప్పుకున్నప్పుడు గంగూలీ గురించి కూడా తప్పకుండా చెప్పుకునేంతగా గంగూలీ తనేమిటో నిరూపించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి