సంప్రదాయ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అజింక్య రహానే సారథ్యంలోని యువజట్టు అద్భుత పోరాట పటిమతో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గబ్బాలో నేడు ముగిసిన నాలుగో టెస్టు తర్వాత తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది.
117.65 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది. 118.44 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఓ అద్భుతమైన విజయం, ఈ గెలుపుతో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా కోటను బద్దలు కొట్టినందుకు టీమ్ ఇండియాకు హార్ధిక శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పట్టుదల, పరాక్రమంతో దేశాన్ని గర్వపడేలా చేశారంటూ జగన్ భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో జగన్ ట్వీట్ వైరల్ అవుతోంది.