కోహ్లీ ఆడకుంటే ఎలా..? స్టార్ స్పోర్ట్స్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన బీసీసీఐ

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:05 IST)
టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆడకుంటే.. మ్యాచ్‌లకు జనాదరణ తగ్గుతుందని స్టార్ స్పోర్ట్స్ అంటోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో విశ్రాంతి పేరిట కోహ్లీని జట్టులోకి తీసుకోకపోవడాన్ని టోర్నీ ప్రసార హక్కులను తీసుకున్న స్టార్ స్పోర్ట్స్ తీవ్రంగా తప్పుబడుతోంది.
 
కోహ్లీ ఆడకుంటే, మ్యాచ్ లకు జనాదరణ తగ్గుతుందని, టీవీల ముందు కూర్చుని చూసేవారి సంఖ్య పడిపోతుందని స్టార్ స్పోర్ట్స్ వాపోతోంది. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో తాము వాణిజ్య పరంగా నష్టపోతామని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం బీసీసీఐ గొడవకు దిగిందని టాక్ వస్తోంది. 
 
ఈ టోర్నీలో అత్యుత్తమ జట్టును ఆడిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ హామీ ఇచ్చిన తర్వాతే, భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి హక్కులను తీసుకున్నామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. ఇక స్టార్ స్పోర్ట్స్ లేవనెత్తిన అభ్యంతరాలను ఏసీసీ, బీసీసీఐ ముందుకు తీసుకెళ్లగా, బోర్డు ఘాటుగా స్పందించినట్టు సమాచారం. 
 
ప్రసార హక్కులున్న సంస్థగానీ, ఏసీసీగానీ జట్టు సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేగాకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టునే దుబాయ్ పంపామని బీసీసీఐ సెలక్టర్లు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు