దాయాది దేశమైన పాకిస్థాన్‌లో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికలు లేకపోవడంతో ఆ దేశంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా ఈ వైరస్ సోకిన మాజీ క్రికెటర్ ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జాఫర్ సర్ఫరాజ్.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్. ఈయనకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పైగా, గత మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటరుపై ఉంచారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తుదిశ్వాస వదిలారు.
కాగా, జాఫర్ సర్ఫరాజ్ తన క్రికెట్ కెరీర్‌ను గత 1988లో ప్రారంభించారు. ఈయన మొత్తం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడి 1994లో రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం కోచింగ్ బాధ్యతలను చేపట్టారు. జాతీయ జట్టుతో పాటు పెషావర్ అండర్-19 టీమ్‌కు కోచ్‌గా కూడా వ్యవహరించారు. జాఫర్ మృతిపట్ల పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.