భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో వీర విహారం చేయడంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ చెన్నై మెట్రో రైళ్లలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపింది.
మెరీనా బీచ్ సమీపంలోని చేపాక్ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఎన్సీఏ, చెన్నై మెట్రో రైల్‌తో కలిసి, గతంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ తరహా సేవలను విజయవంతంగా అందించాయి. ఇది క్రికెట్ అభిమానులకు ఎంతో సౌలభ్యంగా ఉన్నది కూడా. దీంతో రెండో టీ20 మ్యాచ్‌కు కూడా ఈ తరహా సేవలు అందించాలని నిర్ణయించింది.
ఇదిలావుంటే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపు బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి ఛేదించింది.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చిచ్చరపిడుగులా చెలరేగి 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్, అదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లతో కూడిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్న అభిషేక్ శర్మ... తన మెరుపు ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు కొట్టాడు.
మరో ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేశాడు. చివర్లో అభిషేక్ శర్మ ఔటైనా... తిలక్ వర్మ (19 నాటౌట్), హార్దిక్ పాండ్యా (3 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.