థర్డ్ టీ20లో భారత్ చిత్తు : ట్వంటీ20 సిరీస్ శ్రీలంక కైవసం

శుక్రవారం, 30 జులై 2021 (09:13 IST)
కొలంబో వేదికగా జరిగిన థర్డ్ ట్వంటీ20లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో శ్రీలంక జట్టు 2-0 తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి జరిగిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగులో దారుణంగా విఫలమైన భారత జట్టు సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. 
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధావన్ సేన... లంక బౌలర్లకు దాసోహమైంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. 5 పరుగుల వద్ద ఓపెనర్ ధావన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 23, 24, 25 పరుగుల వద్ద ఒక్కో పరుగు తేడాతో మూడు వికెట్లు నేలకూలాయి. 
 
శ్రీలంక బౌలర్లు, ముఖ్యంగా హసరంగ బౌలింగ్ ముందు నిలవలేక భారత కుర్రాళ్లు చేతులెత్తేశారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. చివర్లో భువనేశ్వర్ కుమార్ (16), కుల్దీప్ యాదవ్ (23) బౌలర్లను ఎదురొడ్డి కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో టీమిండియా ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 25 మాత్రమే. ఇందులో మూడు డకౌట్‌లు ఉన్నాయి.
 
స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఫలితంగా టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 
 
శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో అవిష్క ఫెర్నాండో 12, మినోద్ భానుక 18, ధనంజయ డి సిల్వ 23 పరుగులు (నాటౌట్) చేయగా, బౌలింగులో చెలరేగి నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కూల్చిన వనిందు హసరంగ 14 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు