కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది. ఫలితంగా మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. అదేసమయంలో మొదటి ర్యాంకును ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ కైవసం చేసుకున్నాడు.
తాజాగా వెల్లడైన ఐసీసీ ర్యాంకుల జాబితాలో భారత క్రికెట్ జట్టు మాత్రం తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. తాత్కాలిక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, వెస్టిండీస్ జట్లను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలబడింది. పాక్ మొదటి స్థానంలో ఉంది.
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 119 పాయింట్లు ఉండగా.. సిరీస్ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో పాకిస్థాన్ మొదటిస్థానంలో కొనసాగుతుంది.