ఆసియా క్రికెట్ కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత బౌలర్ల సరైన గుణపాఠం నేర్పారు. ఆట మొదలైన తొలి 10 ఓవర్లలోనే కేవలం 49 పరుగులు చేసి నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లోపడింది. 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముంగిట 128 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్థాన్ జట్టులో సాహిబ్ జాదా ఫర్హాన్ చేసిన 40 పరుగులే టాప్ స్కోరర్‌గా నిలిచాయి. షాహీన్ ఆఫ్రిది (33), ఫకర్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటే, బుమ్రాలు రెండేసి వికెట్లు చొప్పున తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాయాది జట్టును కట్టడి చేసింది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా, తొలి బంతికే సయిమ్ అయూబ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. రెండో ఓవర్‍లో బుమ్రా బౌలింగ్‌లో హారిస్ (3) రూపంలో రెండో వికెట్ లభించింది. ఆ తర్వాత సాహిబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్‌ను ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 7.4 ఓవర్లలో ఫకర్ జమాన్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా, 13వ ఓవర్‌లో కుల్దీప్, చివర్లో షాహీన్ ఆఫ్రిది దూకుడుగా ఆడటంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.