బౌద్ధమతం స్వీకరించిన ఎంఎస్.ధోనీ?

సోమవారం, 15 మార్చి 2021 (09:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇపుడు సన్యాసిలా మారిపోయాడు. ఆయన బౌద్ధమతం స్వీకరించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదా ఏదైనా మత గురువులా మారి అడవుల్లోకి వెళ్లాడా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం ధోనీ తాజా ఫోటోనే. 
 
నున్నగా గుండుతో సన్యాసులు ధరించే వస్త్రాలతో సరికొత్త అవతారంలో ధోని కనిపించడంతో అభిమానులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఐపీఎల్‌ అధికారిక ప్రసారదారైన స్టార్‌స్పోర్ట్స్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. అయితే ఓ ప్రకటన కోసమే ధోనీని స్టార్‌స్పోర్ట్స్‌ ఇలా మార్చిందని సమాచారం. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఈ మాజీ సారథి.. ఇప్పుడిలా దర్శనమివ్వగానే నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. 'ధోని ఎలా ఉన్నా.. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు', 'ఓపిక ప్రదర్శించడంలో సన్యాసిలా, ఆటలో యోధుడిలా ఉండడం ధోనీకే చెల్లుతుంది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 
 
కెరీర్‌ ఆరంభం నుంచి కేశాలంకరణలో ధోనీ శైలి ఆకట్టుకుంటూనే ఉంది. మొదట్లో జులపాల జట్టుతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న అతను.. ఆ తర్వాత వివిధ అవతారాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్‌-14 కోసం చెన్నైలో ధోని ప్రాక్టీస్‌ మొదలెట్టిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు