నేపియర్ వన్డే : సెంచరీ కొట్టిన బౌలర్ మహ్మద్ షమీ

బుధవారం, 23 జనవరి 2019 (10:00 IST)
భారత క్రికెట్ జట్టులోని పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్‌లో సత్తాచాటి.. ఏకంగా వంద వికెట్లను తీశాడు. ఇలా వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తన పేరును కూడా లిఖించుకున్నాడు. 
 
భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య 23వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమైన వన్డే సిరీస్‌లో భాగంగా, నేపియర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే షమీ.. అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్ ఓపెనర్లు గుప్తిల్ (5), మున్రో (8)లను పెవిలియన్‌కు పంపాడు. 
 
తద్వారా తన ఖాతాలో వంద వికెట్లను వేసుకున్నాడు. పైగా, అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా వంద వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. షమీ కేవలం 56 వన్డే మ్యాచ్‌లలోనే ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 
 
షమీ కంటే ముందు ఈ ఘనతను సాధించిన భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 59 మ్యాచ్‌లలో వంద వికెట్లు తీయగా, జహీర్ ఖాన్ 65 మ్యాచ్‌లలో, అజిత్ అగార్కర్ 67 మ్యాచ్‌లలో, జవగల్ శ్రీనాథ్ 68 మ్యాచ్‌లలో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు