థాయ్ మసాలా... 70 ఏళ్ల మహిళకు ఇండియన్ కుర్రాడితో పెళ్లి.. ఎందుకో తెలుసా?
శనివారం, 19 జనవరి 2019 (20:13 IST)
సినిమాలో అన్నట్లు థాయ్ మసాజ్... కాదు కాదు... థాయ్‌లో మోసం. అక్కడే వుండే థాయ్ మహిళలు భారతీయ యువకులను పెళ్లిళ్లు చేస్కుంటూ చేస్తున్న మోసాన్ని పోలీసులు చాకచక్యంగా వల వేసి పట్టుకున్నారు.
పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సహజంగా ఇండియన్ కుర్రాళ్లకి విదేశీ మోజెక్కువ. ఎలాగైనా విదేశాలకు వెళ్లి చదువో లేదంటే ఉద్యోగమో చేసి కోట్లకు కోట్లు ఆర్జించాలన్న లక్ష్యం చాలామందిలో వుంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు కొంతమంది అడ్డదారులు తొక్కుతుంటారు. అలా అడ్డదారి తొక్కి అడ్డంగా బుక్కయ్యారు థాయ్‌లాండ్‌కు వెళ్లిన యువకులు.
థాయ్‌లాండ్‌లో పౌరసత్వం సాధించాలంటే అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒక మార్గం. అక్కడి అమ్మాయి ఒప్పుకుంటే ఇది చాలా ఈజీ కూడా. ఐతే ఇండియా నుంచి వచ్చే అందరు అబ్బాయిలను థాయ్ అమ్మాయిలు ఇష్టపడాలనే రూల్ లేదు కదా. కానీ ఇక్కడి అబ్బాయిలకు థాయ్ వెళ్లాలనీ, అక్కడే స్థిరపడాలని ఒకటే ఉబలాటం.
ఇంకేముంది.... వీరి కోర్కెలను క్యాష్ చేసుకునేందుకు మీడియేటర్లు రంగంలోకి దిగిపోయారు. థాయ్ లో ఆల్రెడీ పెళ్లయిపోయి పిల్లలున్న ఆంటీలను ఒప్పించి, ఏదో పెళ్లి చేసుకున్నట్లు నాటకమాడి ఆ తర్వాత అతడికి థాయ్ పౌరసత్వం రాగానే చేతులు దులుపుకోవడం అన్నమాట.
ఇలా ఇద్దరు ముగ్గురితో మొదలైన స్కాం ఏకంగా 27 మంది మహిళల గ్యాంగ్‌గా మారింది. థాయ్‌కి వచ్చే అబ్బాయిలు ఎవరో కనుక్కుని వారిని పర్మినెంటుగా అక్కడే ఉండే ఏర్పాటు కోసం ఈ 27 మంది మహిళలు నిత్య పెళ్లి కుమార్తెలుగా మారిపోయారు. ఎవరు వచ్చినా టపీమని మూడుముళ్లు వేయించుకుని ఆ తర్వాత కారెక్కి వెళ్లిపోతారు. కేవలం లెక్కల్లో మాత్రం ఆమె భర్తగా ఈ భారతీయ కుర్రాడు వుంటాడు. కొన్నాళ్లకు అంతా మర్చిపోతారు.
ఐతే ఇందుకుగాను సదరు మహిళలు లక్షల్లో డబ్బులు వసూలు చేయడం గమనార్హం. పోలీసుల విచారణలో తేలిందేమిటంటే... అసలు ఈ 27 మంది మహిళలు పెళ్లిళ్లు చేసుకున్న ఏ ఒక్క ఇండియన్ కుర్రాడితో కనీసం ఒక్కరోజు కూడా కలిసి వుండలేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే... భారతీయ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మహిళల్లో 70 ఏళ్ల వృద్ధురాలు కూడా పెళ్లాడి డబ్బులు వసూలు చేయడం.
పోలీసులు ఈ కుంభకోణాన్ని ఛేదించి మొత్తం 27 మంది థాయ్ మహిళలతో పాటు మరో భారతీయుడిని అరెస్టు చేశారు.