భారత్, ఆస్ట్రేలియా-ఏ క్రికెట్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజున ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు... జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో విజృంభించాడు. ఓ దశలో బ్యాటింగ్ క్రీజులో బుమ్రా ఉండగా, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో సిరాజ్ ఉన్నాడు.
ఆ సమయంలో ఆసీస్ బౌలర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, గ్రీన్ బంతిని విసరగా బూమ్రా బలంగా బాదాడు. అంతే.. ఆ బంతి నేరుగా బౌలర్ గ్రీన్ తన దిశగా దూసుకువచ్చింది. ఉన్నట్టుండి దూసుకొచ్చిన ఆ బంతిని ఆపేందుకు బౌలర్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు.
దీంతో బంతి గ్రీన్ తలకు బలంగా తగిలింది. బంతి తగలడంతోనే గ్రీన్ కుప్పకూలిపోయాడు. అయితే, బుమ్రా పరుగు తీసేందుకు ముందుకు రాగా, సిరాజ్ మాత్రం బ్యాట్ కింద పడేసి పరుగు పరుగున గ్రీన్ వద్దకు వెళ్లి అతడిని పరామర్శించాడు.
తాను రనౌట్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా, మానవీయ కోణంలో స్పందించిన సిరాజ్ గాయపడిన గ్రీన్ వద్దకు వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సిరాజ్ స్ఫూర్తిని దేశాలకు అతీతంగా క్రికెట్ అభిమానులు వేనోళ్ల కొనియాడుతున్నారు.