పీసీబీ చీఫ్ రేస్ నుంచి తప్పుకున్న నజం సేథీ

మంగళవారం, 20 జూన్ 2023 (15:02 IST)
పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్ రేస్ నుంచి నజం సేథీ అనూహ్యంగా తప్పుకున్నారు. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్‌గా ఆయన కొనసాగుతున్నారు. తదుపరి చీఫ్‌గా ఆయనే ఎన్నిక అవుతారని భావిస్తున్న తరుణంలో రేస్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నారు. తాను బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదన్నారు. 
 
అలాగే తాను పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు అసిఫ్‌ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ మధ్య వివాదానికి మూల కారణంగా కాకూడదని భావిస్తున్నట్లు చెప్పాడు. దీంతో తదుపరి ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది.
 
'అందరికీ నమస్కారం.. అసీప్‌ జర్దారీ, షహబాజ్‌ షరీఫ్‌ల మధ్య వివాదానికి కారణం కాకూడదని నేను అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల మధ్య నేను ఛైర్మన్‌ రేసు నుంచి వైదొలుగుతున్నాను. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాదు' అంటూ సోమవారం రాత్రి ట్వీట్‌ పెట్టాడు.
 
ఈ ఏడాది ఆఖరులో కీలకమైన ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో పాక్‌ క్రికెట్‌లో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పాలక సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు పార్టీలైన.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు బోర్డు ఛైర్మన్‌గా తమ వ్యక్తులే ఉండాలని పట్టుబట్టడంతో ఈ అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నజమ్‌ సేథీ రేసు నుంచి వైదొలిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు