వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టడం లేదు. పైపెచ్చు.. భారత్ ఆడే మ్యాచ్‌లన్నింటినీ తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఇదిలావుంటే, ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్ల కోసం తయారు చేసిన జెర్సీలపై పాకిస్థాన్ పేరుతో లోగోను డిజైన్ చేశారు. ఇది భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివరణ ఇచ్చింది.
ఫిబ్రవరి 19వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. పాకిస్థాన్ ఆతిథ్య దేశం కాబట్టి... ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు ధరించే జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు పాకిస్థాన్ పేరు కూడా ఉంటుంది. అయితే, తమ జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేసింది.