ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ముంగిటి పాకిస్థాన్ మరోమారు సరికొత్త డ్రామాలకు తెరలేపింది. ఈ డ్రామాను మరింతగా రక్తికట్టించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెక్ కౌన్సిల్ చీఫ్ మోసిన్ నఖ్వీ మరింతగా డ్రామా ఆడారు. ఏసీసీ క్రికెట్ చీఫ్‌గా ఉన్న ఆయన.. ఈ టోర్నీలో పాకిస్థాన్ కొనసాగడానికి గల కారణాలను వివరించేందుకు తలాతోకలేని సమాధానాలు ఇచ్చారు.
ఆసియా కప్ నుంచి వైదొలిగితే ఆర్థికంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందనీ, తమకు వచ్చే ఆ కాస్తంత ఆదాయం కూడా రాదని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ టోర్నీలో తమ జట్టు కొనసాగాల్సి వస్తుందని సెలవిచ్చారు. కానీ, పైకి మాత్రం ఐసీసీ రిఫరీ క్షమాపణలు చెప్పడంతోనే ఆడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
'సెప్టెంబర్ 14 నుంచి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మ్యాచ్ రిఫరీ పాత్రపై మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. అయితే, యూఏఈతో పోరుకు కాసేపటి ముందు మ్యాచ్ ఆయన మా టీమ్ కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. 'కరచాలనం' ఘటన జరిగి ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. మేం ఇప్పటికే కోడ్ అతిక్రమణపై విచారణ జరపాలని ఐసీసీని కోరాం.
క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని నమ్ముతున్నాం. ఇది ఆట. అలాగే ఉండనివ్వండి. మిగతా వాటి నుంచి ప్రత్యేకంగా ఉండాలి. ఒకవేళ మేం ఆసియా కప్‌ను బహిష్కరించాలని అనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుంది. అయితే, ప్రధానమంత్రితోపాటు ప్రభుత్వ అధికారులు, ఇంకా చాలా మంది మద్దతు మాకు ఉంది. కానీ, మేం అలా చేయడం లేదు. సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం' అని నఖ్వి వ్యాఖ్యానించారు.
కాగా, గ్రూప్ స్టేజ్‌లో ఇదివరకే ఒకసారి భారత్ - పాకిస్థాన్ తలపడిన సంగతి తెలిసిందే. అందులో టీమ్ ఇండియా విజయం సాధించింది. మరోసారి ఇరు జట్లూ ఢీకొనడం ఖాయం. సూపర్ -4లో అడుగు పెట్టిన భారత్, పాకిస్థాన్ జట్లు సెప్టెంబరు 21న తలపడతాయి. మరోవైపు, భారత క్రికెట్ జట్టు తన చివరి మ్యాచ్‌ను ఒమన్ క్రికెట్ జట్టుతో ఆడాల్సివుంది.