రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇటీవలే 500 వికెట్ల మైలురాయిని అధికమించిన అశ్విన్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్‌లో అశ్విన్ వేసిన రెండో బంతికి ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ స్టో ఔట్ అయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ (23 మ్యాచ్‌లలో) సాధించాడు. అంతేకాకుండా, భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డుకెక్కాడు. అయితే, ఈ జాబితాలో అశ్విన్ కంటే ముందు ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ .. భారత జట్టుపై 139 (35 మ్యాచ్‌లలో) వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.
మరోవైపు, ఒకే దేశంపై వేయి పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మాత్రం ఏడో బౌలర్‌గా నిలిచాడు. అయితే, అశ్విన్ కంటే జార్జ్ గిఫెన్, మోరీ నోబెల్, విల్‌ఫ్రెడ్ రోడ్స్, గార్‌పీల్డ్ సోబెర్స్, ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్‌లు ఈ రికార్డును సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు.