ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సూపర్-8లో భారత్‌కు తొలి విజయం

వరుణ్

శుక్రవారం, 21 జూన్ 2024 (12:01 IST)
అమెరికా, వెస్టిండిస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో భారత్‌కు తొలి విజయం లభించింది. గురువారం ఆప్ఘాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (53) హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ 181/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బుమ్రా (3/7), అర్ష్‌దీప్‌ సింగ్ (3/36) దెబ్బకు అఫ్గాన్‌ 134 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. 
 
ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, 'రెండేళ్ల కిందట విండీస్‌లో టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాం. తొలుత బ్యాటింగ్‌లో 180కి పైగా స్కోరు చేశాం. మిడిలార్డర్‌ బ్యాటర్లు గొప్ప పరిణతి చూపించారు. సూర్యకుమార్ - హార్దిక్ పాండ్య భాగస్వామ్యం కీలకం. చివరి వరకూ ఒక బ్యాటర్‌ క్రీజ్‌లో ఉండాలనుకున్నాం. 
 
మేం విధించిన లక్ష్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైన బౌలింగ్ దళం ఉంది. బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపైనా చర్చించుకున్నాం. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు చేయాలని భావించాం. ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైన నిర్ణయమే. ఒకవేళ పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటే వారినే తీసుకుంటాం. ఏదైనా జట్టు అవసరాలకు తగ్గట్టుగా అంతా సిద్ధంగా ఉంటారు అని వ్యాఖ్యానించారు. 
 
ఆప్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, 'ఇలాంటి పిచ్‌పై 180 పరుగులను ఛేదించవచ్చని భావించాం. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ బౌలింగ్‌లో లయను అందుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్‌ ఆకరులో కాస్త ఇబ్బంది పడ్డా. టీ20 ప్రపంచ కప్‌ లీగ్‌ స్టేజ్‌లోనూ కొనసాగింది. ఇప్పుడు భారత్‌పై కీలకమైన వికెట్లు తీయడంతో దారిలో పడినట్లే. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆడాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు