ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. షేన్ వాట్సన్ మాత్రం సాహో అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైని గెలిపించేందుకు కాలికి రక్తం కారుతున్నా.. ఎవరికీ చెప్పకుండా వాట్సన్ బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో వాట్సన్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. షేన్ వాట్సన్ అంకిత భావానికి మాజీ క్రికెటర్లు, అభిమానులు జోహార్లు చెప్పారు. ప్రశంసల వర్షం కురిపించారు. షేన్ వాట్సన్ కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్ అభిమానులు తనపై చూపెట్టిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశాడు. అందరికీ హాయ్ చెప్తూ మొదలెట్టాడు. ఆపై తనపై ఎనలేని అభిమాన్ని చూపెట్టిన క్రికెటర్లకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. తనకు ఏర్పడిన గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ షేన్ వాట్సన్ థ్యాంక్స్ చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తామని.. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
ఇకపోతే.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ అయిన షేన్ వాట్సన్ తన ఫ్యామిలీతో కలిసి చెన్నై నగరం చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా క్రికెటర్లు తమ ఫ్యామిలీతో కలిసి సరదా సమయం గడపలేకపోయారు. ఐపీఎల్ పూర్తవడంతో ఆటగాళ్లకు విరామం దొరికింది. ఈ విరామాన్ని వారు వినియోగించుకుంటున్నారు.