అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోటీలు ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఆలరించాయి. ఈ పోటీలు శనివారంతో ముగిశాయి. అంతిమ పోరులో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడగా, చివరకు టీమిండియా పొట్టి క్రికెట్ విశ్వవిజేతగా నిలించింది. వెస్టిండీస్ బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయభేరీ మోగించి, విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
అలాగే టోర్నీ ముగియడంతో ఈ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ 2024 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. భారత్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జస్ట్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో 15 వికెట్లు తీశాడు. ఇక ఎకానమీ కేవలం 4.17గా మాత్రమే ఉంది. ప్రత్యర్థుల బ్యాటర్లను అద్భుతంగా నియంత్రించాడు. భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంతో అతడికి ఈ అవార్డు దక్కింది.
ఇక మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరూ టోర్నీలో చెరో 17 వికెట్లు తీశారు. కాగా ఫైనల్ మ్యాచ్ అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 17 వికెట్లతో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ ఎడిషన్‌లోనైనా ఒక ఆటగాడికి ఇవే అత్యధిక వికెట్లుగా ఉన్నాయి.
ఇక 281 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ (257 పరుగులు), ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (255 పరుగులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
టీ20 ప్రపంచ కప్ 2024 అవార్డు విజేతల జాబితా ఇవే..
1. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - జస్ప్రీత్ బుమ్రా (15 వికెట్లు, ఎకానమీ రేటు 4.17)
2. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - విరాట్ కోహ్లీ (76 పరుగులు)
3. స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది ఫైనల్ - సూర్యకుమార్ యాదవ్
4. అత్యధిక పరుగులు - రహ్మానుల్లా గుర్బాజ్ (281 పరుగులు)
5. అత్యధిక వికెట్లు - అర్షదీప్ సింగ్, ఫజల్ హాక్ ఫరూఖీ (17 వికెట్లు)
6. అత్యధిక వ్యక్తిగత స్కోరు - నికోలస్ పూరన్ (98, ఆఫ్ఘనిస్థాన్‌పై)
7. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు - ఫజల్లో హాక్ ఫరూకీ (9 పరుగులకు 5 వికెట్లు, ఉగాండాపై)
8. అత్యధిక స్ట్రైక్ రేట్ - షాయ్ హోప్ (187.71)
9. బెస్ట్ ఎకానమీ రేట్ - టిమ్ సౌథీ (3.00)
10. అత్యధిక సిక్సర్లు - నికోలస్ పూరన్ (17 సిక్సులు)