మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరం పరిధిలోని నివారి జిల్లా రాజపురా గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రియురాలిని ఇంటికి పిలిచి ఆమెతో రాత్రంతా గడిపి, ఆమె తనను పెళ్లాడమంటూ ఒత్తిడి చేయడంతో హత్య చేసి ఆమెను తన ఇంట్లోనే సమాధి చేసాడు. ఆ సమాధి పైన ఆవు పేడతో అలికి దానిపైన మంచం వేసుకుని హాయిగా నిద్రపోయాడు. ఐతే సదరు మహిళ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో నివాసం వుంటున్న రతిరామ్ అనే వ్యక్తికి హత్యగావింపడిన మహిళతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ క్రమంలో అక్టోబరు 2న తన ఇంట్లో ఎవరూ లేరనీ, ఏకాంతంగా గడిపేందుకు రావాలంటూ మహిళకు ఫోన్ చేసాడు. ఆరోజు రాత్రి ఇద్దరూ గడిపారు. అనంతరం సదరు మహిళ రతిరాంతో తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేసింది.
ఐతే అందుకు ఎంతమాత్రం అంగీకరించిన రతిరాం, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను హత్య చేసి తన ఇంట్లోనే గొయ్యి తవ్వి ఆమెను పాతేసాడు. ఆ తర్వాత ఆవు పేడ, మట్టి కలిపి సమాధి పైన అలికాడు. దానిపైన మంచం వేసుకుని గత 3 రోజులుగా నిద్రపోయాడు. ఐతే మహిళ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తమదైన శైలిలో విచారణ జరపడంతో విషయాన్నంతా చెప్పేసాడు. ట్విస్ట్ ఏమిటంటే... వాస్తవం అంతా చెప్పిన నిందితుడు వాష్ రూంకి వెళ్లొస్తానని చెప్పి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.