అదనపు భద్రత.. లేకుంటే పర్యటన రద్దు

ఆదివారం, 22 మార్చి 2009 (14:27 IST)
FileFILE
తమ ఆటగాళ్లకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించకుంటే బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది. ఇటీవల లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో క్రికెటర్లకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పీసీబీ పేర్కొంది.

నిజానికి తమవైపు నుంచి ఆలోచిస్తే బంగ్లాలో ప్రస్తుతం ఆడటం కొంత క్లిష్టమైనది. అందుకే తాము అదనపు భద్రతను కల్పించాల్సిందిగా బంగ్లాను కోరామని పాకిస్థాన్ డైలీ న్యూస్ పత్రికకు ఓ పీసీబీ ఉన్నతాధికారి వెల్లడించారు.

తాము ఆటగాళ్ల భద్రత పట్ల రాజీపడేది లేదని.. ప్రత్యేకించి శ్రీలంక క్రికెట్ జట్టు ఆటగాళ్లపై దాడుల అనంతరం తాము మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. అదలా ఉంచితే.. బంగ్లాలో పర్యటించనున్న పాక్ జట్టుకు అదనపు భద్రతను కల్పించడం సాధ్యం కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇటీవల బంగ్లాలో జరిగిన సైనికుల తిరుగుబాటు (బీడీఆర్)లో బీడీఆర్ చీఫ్ మేజర్ జనరల్ షకీల్ అహ్మద్‌తో సహా 74 మంది భద్రతాదళ సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కారణం చేతనే బంగ్లా ప్రభుత్వం భద్రతను కల్పించడంలో వెనకడుగు వేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి