క్రెస్ట్‌చర్చ్ ట్వంటీ-20లో భారత్ ఓటమి

బుధవారం, 25 ఫిబ్రవరి 2009 (14:46 IST)
న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. క్రెస్ట్‌చర్చ్‌లో బుధవారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో కివీస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 162 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ జట్టు మరో ఏడు బంతులు మిగిలి వుండగానే ఛేదించింది. ఆతిథ్య జట్టు వికెట్ కీపర్ మెక్‌కెల్లమ్ అద్భుతంగా రాణించి అర్థ సంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.

163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తలిగింది. జట్టు స్కోరు రెండు పరుగుల మీద ఉండగా ఓపెనర్ రైడర్ (1) ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గుప్తిల్, మరో ఓపెనర్‌ మెక్‌కల్లమ్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పరిస్థితి చక్కదిద్దాడు.

అలాగే టేలర్ (31), ఓరమ్ (29 నాటౌట్), మెక్‌కల్లమ్ (56 నాటౌట్) పరుగులతో రాణించడంతో కివీస్ జట్టు 18.5 ఓవర్లలో 166 పరుగులు చేసింది. దీంతో కివీస్ జట్టు తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత బౌలర్లలో జహీర్, ఇషాంత్, హర్భజన్ సింగ్‌లు ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి