మేము కొన్ని తప్పులు చేశాం: యువీ

కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో మేము కొన్ని తప్పులు చేశామని టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ అన్నాడు. కివీస్ పిచ్‌లను ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందని యువీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తొలి ట్వంటీ-20లో తాము చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా ఆడతామని యువీ వెల్లడించాడు.

శుక్రవారం జరుగనున్న మ్యాచ్‌లో తక్కువ తప్పులు చేస్తామని ఆశిస్తున్నానని, బుధవారం మరీ ఎక్కువ షాట్లు ఆడటంతోనే ఓటమిని చవిచూశామన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అతిగా షాట్లకు పోవడం తమను దెబ్బతీసిందని, వచ్చే మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందని యువీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. బుధవారం జరిగిన తొలి ట్వంటీ-20లో బ్యాట్స్‌మెన్ల బాధ్యతారహిత ఆటతీరుతో.. మ్యాచ్‌లో భారీ మూల్యమే చెల్లించుకున్న టీం ఇండియా, రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేసి, పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. కాగా, వెల్లింగ్టన్‌లో శుక్రవారం (నేడు) న్యూజిలాండ్ జట్టుతో రెండో ట్వంటీ20ను టీం ఇండియా ఆడనుంది.

బుధవారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి